విజ్ఞానం, వినోదం రెండూ ముఖ్యమే -ఎపి నిట్ రిజిస్ట్రార్ దినేష్‌శంకర్‌రెడ్డి

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
విద్యార్థుల మనోవికాసానికి విజ్ఞానంతోపాటు వినోదం కూడా ముఖ్యమేనని ఎపి నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్‌శంకర్‌రెడ్డి తెలిపారు. ఎపి నిట్‌లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న టెక్రియా-2023 ఆరంబ్ కార్యక్రమం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా దినేష్ శంకర్‌రెడ్డి మాట్లాడుతూ విభిన్న ఆలోచనలు ప్రతి విద్యార్థి జీవితంలో భాగం కావాలని, అవి వారి వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దడంతోపాటు చుట్టుపక్కల ఉన్నవారికి ఒక ధర్మ మార్గం చూపేలా ఉండాలని అన్నారు. శాస్త్రవేత్తలు ఒక గొప్ప వైజ్ఞానిక ప్రాజెక్టు కోసం ఏళ్ల తరబడి అంకితభావంతో పని చేస్తారని వారి స్ఫూర్తితో విద్యార్థులు ప్రయోగశాలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఆవిష్కరణలు ఊపిరిపోసుకుంటాయని వివరించారు.
ఆకట్టుకున్న స్టార్టప్ ఎక్స్‌పో
సంస్థలోని ఇన్నోవేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జిఆర్‌కె.శాస్త్రి పర్యవేక్షణలో నిర్వహించిన స్టార్టప్ 20 ఎక్స్‌పో 2024 కార్యక్రమం ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 17 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి మొత్తం 75 టీములు తమ ప్రాజెక్టులను ప్రదర్శించాయి. వీటిలో ఐదు ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేసి బహుమతులను అందజేశారు. గతేడాది నిర్వహించిన కార్యక్రమానికి 14 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి 36 టీమ్‌లు రాగా ఈ ఏడాది వాటికి రెట్టింపు స్థాయిలో ప్రాజెక్టులు రావటం విశేషం.
మైమరిపించిన ప్రదర్శనలు
నిట్ విద్యా సంస్థలోని ఎనిమిది ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌ల అసోసియేషన్లు, 17 క్లబ్‌ల ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించిన వివిధ రకాల ప్రదర్శనలు చూపరులను మైమరిపించాయి. ఆయా ప్రదర్శనలను, ప్రాజెక్టులను గూడెం చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఎంతో ఆసక్తిగా తిలకించి, వాటి వివరాలు, అవి పనిచేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీన్‌లు, విభాగాధిపతులు, ఆచార్యులు పాల్గొన్నారు.