
శాఖ గ్రంథాలయాల ఆధ్వర్యాన ఆయా గ్రంథాలయాల్లో విద్యార్థులకు నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలు విజ్ఞానదాయకంగా ఉంటున్నాయి. కథలు, పద్యాలు, పాటలు, చదరంగం, చిత్రలేఖనం, గణితం వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వడం, పోటీలు నిర్వహించడం చేస్తున్నారు.
ప్రజాశక్తి-చోడవరం
వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా చోడవరం శాఖ గ్రంథాలయంలో బుధవారం విద్యార్థులు కథలు చదివి, గేయాలు ఆలపించారు. డ్రాయింగ్‌లో బేసిక్స్‌ను డి.గణేష్ నేర్పించారు. గణితంలో సూత్రాలను మేథ్స్ ఉపాధ్యాయుడు వివరించారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి జి.తిరుమల కుమారి, విద్యార్థులు పాల్గొన్నారు.
వడ్డాది : బుచ్చయ్యపేట మండలం వడ్డాది శాఖ గ్రంథాలయంలో బుధవారం విద్యార్థులకు కథలు, పాటలు, పుస్తక పఠనం, తెలుగు పదాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి వై.వెంకటేశ్వర్లు, అతిథి దేవోభవ స్వచ్చంద సంస్థ నిర్వాహకుడు ఆరిపాక కామేశ్వరరావు, విశ్రాంత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సబ్బవరం : స్థానిక శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరంలో భాగంగా బుధవారం విద్యార్థులకు చదరంగం పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి వి.శిరీష, ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
కోటవురట్ల : విద్యార్థులు పుస్తకాలు చదవడం ఎంత ముఖ్యమో కథలు చెప్పడం కూడా అంతే ముఖ్యమని వేసవి విజ్ఞాన శిబిరంలో శాఖ గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు మస్తాన్ తెలిపారు. బుధవారం పుస్తకాలు చదవడం, కథలు చెప్పడం పలు కార్యక్రమాలు నిర్వహించారు. చదవడంతో పాటు కథలు చెప్పడం కూడా అలవాటు చేసుకున్నట్లయితే సమాజంలో వ్యక్తులతో ఎలా మాట్లాడాలో తేలికగా అర్థమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శాఖ గ్రంథాలయ అధికారి అప్పలనాయుడు, ఎల్.సతీష్ పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్ : స్థానిక శాఖా గ్రంధాలయం లో వేసవి శిక్షణ శిబిరాలు కొనసాగుతున్నాయి. జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ పి అచ్చమ్మ విద్యార్థులతో దేశభక్తి గీతాలు పాడించారు. కధలు చదివించి వాటిలోని నీతిని తెలియపరిచారు. పివి కనకరాజు మాస్టారు కధలు, శ్లోకాలు విద్యార్థులకు నేర్పించారు.పిల్లలకు పోడుపు కధలు, క్విజ్ ప్రశ్నలు వేసి ఉత్సాహపరిచారు.జనవిజ్ఞాన వేదిక నాయకులు త్రిమూర్తులు రెడ్డి విద్యార్థులను ఉత్సాహ పరిచే విధంగా మైండ్ గేమ్ ఆడించారు. గ్రంధాలయధికారిని దమయంతి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
నక్కపల్లి : మండలంలోని చినదొడ్డిగల్లు గ్రంధాల యంలో వేసవి విజ్ఞాన శిబిరం కార్యక్రమంలో భాగంగా బుధవారం గ్రంధాలయ అధికారి జనార్ధన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కథల పోటీలు నిర్వహించారు. విద్యార్థులతో కథలు చెప్పించారు. కథల్లో నీతిని వివరించారు.విద్యార్థులు ప్రతిరోజు గ్రంథాలయాలకు వచ్చి పుస్తక పఠనం అలవాటును అలవర్చుకోవాలన్నారు. పుస్తక పఠనంతో మేధస్సు పెంపొందుతుందన్నారు .
గొలుగొండ: శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం సందర్భంగా గ్రంథాలయ అధికారి రాజబాబు ఆధ్వర్యంలో మూడవ రోజున బుక్ రీడింగ్, నీతి కథలు చెప్పే కార్యక్రమం నిర్వహించారు. లేమన్ అండ్ స్పూన్ ఆట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, సీఆర్పీ రామకృష్ణ, ఏఎన్‌ఎం లక్ష్మీ పాల్గొన్నారు.
పెందుర్తి : శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరంలో మూడవరోజు బుధవారం వివిధ పాఠశాలల నుండి 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు. లైబ్రేరియన్ సూర్యకళ పర్యవేక్షణలో టీచర్ ఎం మహేశ్వరరావు కథలు రాయడం, కథలు చదవడం వంటి మంచి అలవాట్లను విద్యార్థులు అలవరచుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో కథలు చదివే కంటే, పుస్తకాల్లోని కథలు చదవడం మంచిదన్నారు. మాతృభాష గొప్పతనం తెలియజెప్పారు. డైట్ టీచర్ సబీనా యాస్మిన్ స్పీడ్ మాథ్స్, మరో డైట్ టీచర్ బషీరా కథలు రాయడంపైనా, డాన్స్ టీచర్ శార్వాణిదేవి కూచిపూడి నాట్యాన్ని విద్యార్థులకు నేర్పించారు
సింహాచలం : అడవివరం శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా మూడో రోజు బుధవారం లైబ్రేరియన్ నర్సింహం ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. పుస్తక పఠనం వలన విజ్ఞానంతో పాటు వినోదం ఆహ్లాదం కలుగుతుందని, ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవాటు చేసుకుంటే ఎంతో ప్రయోజనమన్నారు. టీవీలు, సెలఫోన్లకు అతుక్కుపోయి ఆరోగ్యం పాడుచేసుకునే కంటే, పుస్తకపఠనంపై విద్యార్థులు ఆసక్తి చూపాలని సూచించారు.