Feb 27,2022 06:50

కాల్పనిక సాహిత్యంలో బమ్మెర పోతన, శ్రీనాథుడు గురించి అనేక అల్లికలు ఉన్నాయి. వాటి సంగతి పక్కన పెడితే...నిరంతరం రాజాశ్రయాన్ని నమ్ముకుని, తన జ్ఞానాన్ని అమ్ముకుని చివరికి కటిక దారిద్య్రాన్ని అనుభవించాడు శ్రీనాథుడు. నిత్యం పేదరికంలో ఉంటూనే సంతృప్తితో జీవించాడు పోతన. కటిక దారిద్య్రం అనుభవిస్తూ కూడా తన భాగవతాన్ని రాజుకి అంకితమిచ్చేందుకు ఒప్పుకోలేదు. 'బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్‌/ గూళలకిచ్చి యప్పడుపుగూడు భుజించుటకంటె సత్కవుల్‌/ హాలికులైన నేమి? గహనాంతర సీమల గందమూల కౌ/ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై' అంటాడు పోతన. గున్నమామిడి చెట్టుకు పూసిన లేత చివుళ్ళలా కోమలమైనట్టి, కావ్యం అనే కన్యను అమ్ముకుని, అట్టి నీచపు కూడు తినడం కంటే, నిజమైన కవి నాగలి పట్టిన వ్యవసాయదారుడైనప్పటికి, అటవీ ప్రాంతాలలో కంద దుంపలు, పుట్టతేనెలతో జీవించువారైనప్పటికి తప్పులేదని అర్థం. అందుకే తన రచనను రాజుకు అంకితమివ్వడానికి అంతగా వ్యతిరేకించాడు పోతన. దీనికి పూర్తి విరుద్ధం శ్రీనాథుడు. రాజుల సాంగత్యంతో చివరికి అవమానాలతో జైలుపాలవుతాడు. వీరిలో ఒకరు విలువల కోసం నిలబడితే... మరొకరు ఆ విలువలను రాజన్యుల పాదాక్రాంతం చేస్తారు. ప్రపంచాన్ని వినాశనం వైపు నడిపించిన హిట్లర్‌ ఎంత ఒత్తిడి చేసినా... ఐన్‌స్టీన్‌ గాని, ఆయన అనుచరులు గానీ వారు కనిపెట్టిన అణుబాంబు రహస్యాన్ని హిట్లర్‌కు చెప్పలేదు. అలాగే... ప్రతి దశలోనూ తమ విజ్ఞాన విలువలను కాపాడుకునే వారు, తమ విజ్ఞానాన్ని సొమ్ము చేసుకోవాలనుకునే తెలివితక్కువ మేధావులూ వున్నారు.
విజ్ఞానం తమ సొత్తుగా భావిస్తుంటారు కొందరు మేధావులు. సొత్తు అనగానే అమ్ముకునే, కొనుక్కునే హక్కు వస్తుంది. వారు జ్ఞానాన్ని తమ బుర్రలోకి ఎక్కించుకోక పోయినా, దాన్ని సొంతం చేసుకుంటారు. లాభానికి లోబడి వుండే సొత్తులా భావిస్తారు. ప్రపంచం ఎలా వినియోగించుకోవాలో కూడా నేనే శాసిస్తానంటాడు. జ్ఞానం నిరంతరం వద్ధి చెందేది. దానికి అవధులు లేవు. 'విజ్ఞానం అత్యుత్తమమైన సృజనాత్మక కళారూపం' అంటాడు ప్రముఖ శాస్త్రవేత్త సి.వి.రామన్‌. అలాంటి సృజనాత్మకమైన జ్ఞానాన్ని వ్యక్తుల లాభాపేక్షకు లోబడేలా చేస్తుంది పేటెంట్‌. తెలివితేటలు లేకపోయినా డబ్బుంటే చాలు...ఎదుటివారి తెలివితేటలను లాభంగా మార్చుకుంటారు. విజ్ఞానం సమిష్టి కృషిలో నుంచి, మనిషి మనుగడ కోసం పడే ఘర్షణలోంచి అభివృద్ధి చెందుతుంది. ఈ ఘర్షణ సమిష్టిగా జరిగేదే తప్ప ఒక్కరు చేసేది కాదు. ఎంత గొప్ప శాస్త్రవేత్తయినా కళ్లు మూసుకొని చెట్టు కింద కూర్చుంటే జ్ఞానం రాదు. లాబొరేటరీల్లో పరిశోధనలు చేయాల్సిందే. ఆ పరిశోధనలు కూడా ఒక బృందంగానే జరుగుతాయి తప్ప ఒక్కరివల్ల కాదు. ఏ శాస్త్రవేత్త అయినా అప్పటికే వున్న జ్ఞానాన్ని తాను పరిశోధించి...మరో మెట్టు పైకి తీసుకెళతాడు. అంతే తప్ప, సున్నా నుంచి ప్రారంభం కాడు. అంటే... తాను నేర్చుకున్న జ్ఞానం అంతకుముందు తరాల నుంచి నేర్చుకున్నట్లే కదా. మరి వారు కనిపెట్టిన విజ్ఞానం వారి సొంతమెలా అవుతుంది? ముందు తరాల నుంచి నేర్చుకున్న లేదా కొనుగొన్న జ్ఞానాన్ని... తన తర్వాతి తరాలకు అందిస్తాడు. అలా విజ్ఞానం అభివృద్ధి అవుతూ...భవిష్యత్తరాలకు చేరుతుంది తప్ప, ఇది నాదని చెప్పే హక్కు, దానిపైన పేటెంటు ఎవరికీ లేదు. న్యూటన్‌ సిద్ధాంతం, ఆర్కెమెడిస్‌ సూత్రం వంటివి అందరివి. ఈ సూత్రాలను వాడుకుంటున్న వారు....వారి వారసులకు పేటెంట్‌ చెల్లిస్తున్నారా? లేదు కదా.
కాబట్టి జ్ఞానాన్ని వ్యాపారంగా దిగజార్చితే, అదే ప్రతిబంధకంగా తయారవుతుంది. వ్యాపారవేత్త విజ్ఞానం మీద పేటెంట్‌ సాధించినట్లయితే, దాన్ని ఆ పై మెట్టుకు వెళ్లనివ్వడు. సరికదా తన వ్యాపార ప్రయోజనమే పరమావధిగా భావిస్తాడు. జ్ఞానాన్ని బంధించే ఈ ప్రతిబంధకాలను, పేటెంట్‌ సంకెళ్లను బద్దలు కొడితేనే జ్ఞానం వికసిస్తుంది. జ్ఞానం వ్యక్తి ప్రయోజనం కోసం కాదు...అది సమాజ ప్రగతికి మార్గం. 'బహుజన హితాయ, బహుజన సుఖాయ' అన్నారు పెద్దలు. విజ్ఞానాన్ని అన్వేషించే ప్రతి ఒక్కరూ ఈ రకంగా ఆలోచించాలి. విజ్ఞానం ఎలా బతకాలో తెలియజేస్తుంది. కనుక స్వార్థం కోసం, సొంత ప్రయోజనాల కోసం విజ్ఞానాన్ని వ్యాపారంగా మార్చాలనుకుంటే, ఆ సమాజం అజ్ఞానం వైపు నెట్టబడుతుంది. అలాంటి బంధకాలను, అజ్ఞానపు సంకెళ్లను తెగ్గొట్టుకొని, విజ్ఞానపు వెలుగుల వైపు పయనించాలి. అప్పుడే 'విజ్ఞాన దినోత్సవం'కి ఒక సార్థకత ఏర్పడుతుంది.