Sep 05,2021 11:56

విజ్ఞాన జ్యోతి ఆచార్య

శిశువును లోకానికి పరిచయం చేసిన తొలి గురువు అమ్మ. గుండెలపై తన్నుతూ ఆటలాడే బిడ్డకు నడక నేర్పే నాన్న రెండో గురువు. ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి, విద్యా బుద్ధులు అందించే ఉపాధ్యాయులు మూడో గురువు. అందుకే పెద్దలు 'మాతృ దేవోభవ.. పితృ దేవోభవ.. ఆచార్య దేవోభవ...' అంటూ తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని గురువుకు కట్టబెట్టి.. సమాజంలో ఒక సమున్నత స్థానాన్నిచ్చారు. అభివృద్ధి పథంలో నడిచే ప్రతి సమాజంలో గురువుల పాత్ర తప్పక ఉంటుంది. ప్రతి మనిషీ తన జీవిత కాలంలో కుటుంబసభ్యుల తర్వాత ఎక్కువ సమయం గడిపేది ఉపాధ్యాయులతోనే. అందుకే వారు చెప్పేదే విద్యార్థులు వినేది. ఆ మాటలకే ప్రేరేపితులయ్యేది. వారి మార్గాన్నే అనుసరించేది. వారినే అనుకరించేది. చివరకు వారి జీవన విధానానికే ఆకర్షితులై తనకు మార్గదర్శకులుగా భావిస్తారు. జీవితాంతం వాళ్లను గుర్తుపెట్టుకుంటారు. ఇదో సామాజిక ప్రక్రియ. కరోనా మహమ్మారి అనేక మార్పులను తీసుకొచ్చింది.. దీనిప్రభావం విద్యార్థికి గురువుకి ఉన్న సంబంధంపైనా పడింది. తరగతిగదికి విద్యార్థులను దూరం చేస్తోంది. ఈ నేపథ్యంలో గురువులను గురించే ఈ కథనం..

విజ్ఞాన జ్యోతి ఆచార్య

గురువు పాఠ్యాంశాలను బోధించడంతోనే సరిపెట్టుకోరు. ప్రపంచ గమనాన్ని అవగతం చేయడం ద్వారా విద్యార్థుల నడవడికను తీర్చిదిద్దుతారు. ఉన్నతమైన ఆశయాలను బోధిస్తారు. ఆ ఆశయ సాధన దిశగా దిశానిర్ధేశం చేస్తారు. ప్రతి గురువూ తన వ్యక్తిత్వం ద్వారా విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేస్తారు. అలాంటి గురువు ఎప్పటికీ విద్యార్థుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.

                                                                   ఆన్‌లైన్‌.. ఆటంకాలు..

విజ్ఞాన జ్యోతి ఆచార్య


    నేటితరం విద్యార్థులు బడికి వెళ్లినా, వెళ్లకపోయినా ఉపాధ్యాయుడి అవసరం లేకుండానే విషయ పరిజ్ఞానం సంపాదించుకునే వెసులుబాటు ఉంది. ఈ డిజిటల్‌ యుగంలో పాఠాలన్నీ నెట్‌, టీవీ, చివరకు ఫోన్‌లలో అనేక యాప్‌ల ద్వారా విద్యార్థికి చేరిపోతున్నాయి. వాస్తవానికి తరగతి గదిలో పాఠాలు వింటే శిష్యులు తమ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ డిజిటల్‌ పాఠాల వల్ల ఉపాధ్యాయులని స్క్రీన్‌ మీద చూడటం తప్ప, వారితో నేరుగా బంధాన్ని ఏర్పరచుకునే అవకాశాన్ని విద్యార్థులు కోల్పోతున్నారు. ఉపాధ్యాయులు చెప్పిందే వినడం తప్పా, అనుమానాలను నివృత్తి చేసుకునే అవకాశం లేదు. టెక్నాలజీ పరంగా ఈ పద్ధతి బాగున్నా.. రానున్న రోజుల్లో గురుశిష్యుల బంధం పలచబడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర మారుతోంది. గతంలో తరగతి గదిలో పాఠాలు చెప్పాలంటే నల్లబల్ల, సుద్దముక్క, డస్టర్‌ ఉంటే సరిపోయేది. కానీ నేడు అలాంటి పరిస్థితులు లేవు. కంప్యూటర్లు, పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్లు, ప్రొజెక్టర్లు, ట్యాబ్‌లను ఉపయోగిస్తూ పాఠాలు చెప్పే రోజులు వచ్చేశాయి. అయినప్పటికీ, ఉపాధ్యాయులు ప్రభావశీలురుగా తమ ఔచిత్యం కోల్పోకుండా, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీని నేర్చుకుంటూ నిత్యవిద్యార్థిగా మారుతున్నారు. ఎక్కడా బేషజాలకు పోకుండా కొత్త భావాలు స్వీకరించడానికి, సరికొత్త విషయాలు నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉంటూ ఆధునిక గురువుగా మారుతున్నారనడంలో సందేహం లేదు.

                                                               ఎందుకీ చిన్నచూపు ?

విజ్ఞాన జ్యోతి ఆచార్య

     కరోనా కష్టకాలంలో ఉపాధ్యాయుల దుస్థితి వింటే గుండె తరుక్కుపోతోంది. వైరస్‌ విజృంభణ ప్రభావం వారిపౖౖె తీవ్రంగా పడింది. కొందరు ప్రాణాలను సైతం కోల్పోయారు. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు జీవనోపాధిని కోల్పోయి, తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. కొందరు బేషజాలు పక్కనపెట్టి బజ్జీలు అమ్మితే.. మరికొందరు కూలిపనులకు వెళుతున్నారు. ఇంకొందరు దొరికిన పని చేసుకుంటూ మూడుపూటలా కడుపు నింపుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. కరోనా కారణంగా పాఠశాలలు మూసివేయడంతో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నాయి యాజమాన్యాలు. పదిమంది పని చేయాల్సిన చోట కేవలం ఒక్క ఉపాధ్యాయునికే పాఠాలు చెప్పే అవకాశమిచ్చాయి కార్పొరేట్‌ యాజమాన్యాలు. సరే ఆ ఒక్క ఉపాధ్యాయుని చేతనైనా రోజూ పాఠాలు చెప్పిస్తారా? అంటే అదీలేదు. ఎవరు తక్కువ పారితోషికానికి ఒప్పుకుంటే వారిచేత పాఠాలు చెప్పిస్తూ విద్యార్థులను గందరగోళంలో పడేస్తున్నాయి యాజమాన్యాలు. ముందురోజు విన్న పాఠానికి, ఆరోజు వినే పాఠానికి మధ్య సంబంధం లేకపోవడంతో విద్యార్థులు తెల్లమొహాలు వేయాల్సి వస్తోంది. దీంతో ఉపాధ్యాయుడికి, విద్యార్థికి మధ్య నామకేవాస్తి బంధం తప్పా, శాశ్వత బంధం ఏర్పడటం లేదు.

రోడ్డున పడేసిన కార్పొరేట్లు..

విజ్ఞాన జ్యోతి ఆచార్య

     కరోనాకు మునుపు కార్పొరేట్‌ పాఠశాలలు వారి ప్రయోజనాల కోసం ప్రైవేటు టీచర్లకు ఉపాధి కల్పించింది. కానీ నలుగురు చేయాల్సిన పనిని ఒక్కరి చేత చేయిస్తూ వారిని ముప్పతిప్పలు పెట్టింది. పొట్టకూటి కోసం అన్ని బాధలు భరించినా కరోనా వ్యాప్తి చెందగానే కార్పొరేట్‌ యాజమాన్యాలు ప్రైవేటు ఉపాధ్యాయులను రోడ్డున పడేసింది. దాంతో ఎందరో ఉపాధ్యాయులు జీవనోపాధిని కోల్పోయారు.
కరోనా కష్టకాలంలో ఎందరో ఉపాధ్యాయులు జీవనోపాధిని కోల్పోయారు. అలాంటి వారిలో మచ్చుకు కొందరు.. ఖమ్మంజిల్లా సత్తుపల్లి ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసిన రాంబాబు, ప్రకాశంజిల్లా ఒంగోలు ప్రైవేటు స్కూల్లో పనిచేసే తాండ్ర రమణ, శ్రీకాకుళం జిల్లా పలాసపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్‌, కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చెందిన అబ్దుల్‌ షఫీ, నెల్లూరుకు చెందిన పట్టెం వెంకట సుబ్బయ్యలాంటి వారు ఇంకెందరో బాధిత ఉపాధ్యాయులు.

విజ్ఞాన జ్యోతి ఆచార్య

                                                                  ప్రాణాలకు విలువేది ?

     కరోనా సమయంలో ఎన్నికలంటూ ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రాణాలతో ప్రభుత్వాలు చెలగాటమాడాయి. కరోనా మొదటివేవ్‌లో సుమారు 400 మంది, రెండవ వేవ్‌లో సుమారు 650 మంది మన రాష్ట్రంలో ఉపాధ్యాయులు ప్రాణాలను కోల్పోయారు. వారికి ప్రభుత్వం నేటికీ ఎలాంటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేదు. రేపటి పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని అనుకోవాల్సి వస్తోంది.
 

                                                                  దేశానికే ఆదర్శం..

విజ్ఞాన జ్యోతి ఆచార్య

     కేరళలోని మలప్పురమ్‌ జిల్లాలోని మూర్కనాడ్‌ ప్రాంతంలో 'ఎఇఎంఎయుపి' స్కూలు ప్రయోగాత్మకంగా ఆగ్మెంటెడ్‌ రియాలిటీ పవర్స్‌ (ఏ టాపిక్‌ గురించి పాఠం చెబుతుంటే ఆ వస్తువు క్లాస్‌రూంలో ఉన్నట్లు విద్యార్థికి కనిపిస్తుంది) ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించి, కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. పిల్లల్లో ఆసక్తిని కలిగిస్తూ వినూత్నంగా వారు నడిపిన ఆన్‌లైన్‌ క్లాసులు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. కొద్దికాలం క్రితం నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్టీ) ఒక సర్వే నిర్వహించింది. అందులో అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. అవి సాంకేతికంగా, పిల్లల వైపు నుంచి వచ్చిన సమస్యలు. వాటన్నింటినీ అధిగమిస్తూనే అక్కడ ఉపాధ్యాయులు పిల్లలకు ఆన్‌లైన్‌ పాఠాలు నిర్వహించడం గొప్ప విషయం. మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా సమయంలో కొందరు ఉపాధ్యాయులు చెట్టులెక్కి, పుట్టలెక్కి ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించడం మనం చూసే ఉన్నాం. సెల్‌ఫోన్‌ సిగల్స్‌ అందని ప్రాంతాల్లో ఇళ్ల ముందు ప్రహరీగోడలపై పాఠాలు రాసి, వినూత్న ప్రయోగాలు చేసిన ఉపాధ్యాయులూ ఉన్నారు.
 

                                                            ఎందరో మహోపాధ్యాయులు

విజ్ఞాన జ్యోతి ఆచార్య

         సర్వేపల్లి రాధాకృష్ణన్‌తోపాటు ఆధునిక భారతదేశంలో విద్యార్థులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన మరికొందరు మహోపాధ్యాయులు కూడా ఉన్నారు. ఆధునిక విద్యా రంగానికి పునాదులు వేసిన వారిలో అగ్రగణ్యులుగానూ గుర్తింపు పొందారు. అలాంటి వారిలో సాహిత్యంలో నోబెల్‌ బహుమతి సాధించిన కవీంద్రుడు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 'గురుదేవుని'గా సుప్రసిద్ధులు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయన విద్యారంగంలో సంస్కరణల కోసం తనదైన శైలిలో అపారమైన కృషి చేశారు. ''నాలుగు గోడల మధ్య కాదు విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సింది... ప్రకృతి ఒడిలో వారికి చదువు చెప్పాలి'' అన్నదే ఆయన సిద్ధాంతం.

విజ్ఞాన జ్యోతి ఆచార్య


     బ్రిటిష్‌ హయాంలో దేశంలోని దళితుల పరిస్థితులు దుర్బరంగా ఉండేవి. అంటరానితనం కారణంగా దళితులు చదువులకు దూరంగా ఉండేవారు. అలాంటి రోజుల్లో జ్యోతిరావు పూలే, ఆయన భార్య సావిత్రీబాయి పూలే దళితుల్లో విద్యావ్యాప్తికి ఎనలేని కృషి చేశారు. అంతేకాకుండా అస్పృశ్యత నివారణకు, స్త్రీ విద్యకు, మహిళల స్వావలంబనకు పూలే దంపతులు అలుపెరుగని కృషి చేశారు. బాలికల కోసం 1848లో దేశంలోనే తొలి పాఠశాలను నెలకొల్పిన భారతీయులు పూలే దంపతులే కావడం విశేషం. జ్యోతిరావు పూలే తొలుత తన భార్య సావిత్రీబాయికి చదువు నేర్పారు. తర్వాత పూణేలో బాలికల పాఠశాల ప్రారంభించారు. దీనిపై కుటుంబం నుంచి, సాటి కులస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో సొంత ఇంటినే విడిచి పెట్టాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో ఉస్మాన్‌ షేక్‌ అనే మిత్రుడు, ఆయన సోదరి ఫాతిమా పూలే దంపతులకు తమ ఇంట ఆశ్రయం కల్పించారు. అక్కడే బాలికల పాఠశాల నడుపుకొనేందుకు వెసులుబాటు కల్పించారు. ఆ పాఠశాల కొనసాగుతుండగానే పూలే దళితుల కోసం మరో మూడు పాఠశాలలను నెలకొల్పారు. దళితుల జీవితాల్లో విద్యాజ్యోతులు వెలిగించిన తొలి గురువుగా జ్యోతిరావు పూలే చిరస్మరణీయమైన సేవలందించారు.

                                                         ఉపాధ్యాయదినోత్సవ నేపథ్యం

విజ్ఞాన జ్యోతి ఆచార్య

     గురువు స్థానంలో ఉండి భారతీయ విద్యా విధానాలకు, విద్యా వ్యాప్తికి ఎనలేని కృషి చేసిన వ్యక్తి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌. ఆయన రాజమండ్రి ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గానూ పనిచేశారు. ఏ పనిలోనైనా నిబద్ధత కలిగి ఉండాలి అనేది ఆయన జీవితం మనకు నేర్పిన పాఠం. 1888, సెప్టెంబరు 5న తిరుత్తణిలో వీరాస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించారు. బాల్యం నుంచే అపారమైన తెలివితేటలను ప్రదర్శించేవారు. విద్యార్థి దశలోనే మనస్తత్వ శాస్త్రంపై బాగా అధ్యయనం చేసి, ఆయనిచ్చిన ఉపన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 21వ ఏటనే ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. ఆయన జీవితంలో ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. 1962వ సంవత్సరం నుంచి ఆయన పుట్టినరోజును 'ఉపాధ్యాయ దినోత్సవం'గా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజు పాఠశాలకు ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను ఎంపిక చేసి, వారికి అవార్డులు ఇవ్వడం పరిపాటిగా వస్తోంది.

 

విజ్ఞాన జ్యోతి ఆచార్య

                                                                 ఆదర్శ గురువులు

     గురువు అంటే గౌరవం లేని విద్యార్థులంటూ ఎవరూ ఉండరు. కానీ ఇష్టమైన గురువు చెబితే ఎంత కష్టమైన విషయాన్నైనా ఇట్టే ఒంటపట్టించుకుంటారు. ఇష్టమైన గురువంటే ఎవరు? విద్యార్థులను తల్లిదండ్రుల్లా దగ్గరకు తీసి, ప్రేమను పంచేవారు. వీరు అందరిలా పాఠాలూ చెబుతారు. అంతటితో ఆగకుండా విద్యార్థులతో తానొక స్నేహితునిలా కలిసిపోతారు. వారి మనసులోని భావాలను తమతో పంచుకునే స్వేచ్ఛను ఇస్తారు. సమాజం పట్ల సామాజిక బాధ్యతగా ఎలా మెలగాలో ఎప్పటికప్పుడు కొన్ని సంఘటనల ద్వారా విద్యార్థులకు వివరిస్తూ ఉంటారు. రోజువారీ జీవితంలోనే సామాజిక సేవ ఎలా చేయాలో నేర్పుతారు. వీరు తమ సామాజిక బాధ్యతను ఎవరి గొప్పల కోసమో నిర్వర్తించరు. రాబోవు తరానికి సామాజిక బాధ్యత కలిగిన సైన్యాన్ని తయారుచేయాలనే ఆకాంక్షతోనే ఇదంతా చేస్తారు.

విజ్ఞాన జ్యోతి ఆచార్య


     గతం కన్నా భవిష్యత్తుపైనే ఉపాధ్యాయులు ఎక్కువగా దృష్టి సారించాలి. ఎందుకంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాబోయే కాలంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించే తరాన్ని సిద్ధం చేయాలి. నాలుగు గోడల మధ్య మేధోమధనం ద్వారా సమసమాజాన్ని స్థాపించే ఆలోచనలు కలిగించే అవకాశం ఒక్క గురువుకే సాధ్యమవుతుంది. కానీ సిలబస్‌ పూర్తిచేసేంత వరకే వారిని పరిమితం చేస్తున్నాయి ప్రభుత్వాలు. దీంతో విద్యార్థి అసమాన సమాజానికే సమిథగా మారుతున్నాడు.
 

                                                                   ఆదర్శవంతంగా..

విజ్ఞాన జ్యోతి ఆచార్య

       ప్రతి పౌరుడూ సామాజిక బాధ్యతను కలిగి విలువలతో కూడిన విద్యా వ్యాప్తికి కృషి చేయాలి. టీచర్‌ ట్రైనింగ్‌ చేసిన వ్యక్తులే గురువులు అనడం సమంజసం కాదు. సామాజిక బాధ్యతతో ఎవరికి వారే గురువుగా మారిన వ్యక్తులూ గురువులే. నేటి సమాజంలో యువత అన్ని విషయాల్లోనూ భాగస్వాములవుతూ దేశానికి తమవంతు సేవ చేస్తూనే ఉన్నారు. ఉదాహరణకు డెహ్రాడూన్‌కు చెందిన జారు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు శర్మ కరోనా కష్టకాలంలో సుమారు వందమంది అనాథలను దత్తత తీసుకుని, చదువు చెప్పిస్తున్నారు. ఒకవైపు తాము చదువుకుంటూ మరోవైపు తమకన్నా చిన్న తరగతుల పిల్లలకు చదువులు నేర్పుతున్న విద్యార్థులూ గురువులే. అంతేకాదు వృత్తి పనులు చేసుకుంటూ ఎందరికో తమ విద్యను ఉచితంగా నేర్పించే కళా నైపుణ్యం కలిగిన వ్యక్తులనూ మనము గురువులుగా గుర్తించడం అవసరమే. ఇలాంటి వారందరినీ ఆదర్శవంతంగా తీసుకోవాలి.. అనుసరణీయం చేసుకోవాలి. వీరందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేద్దాం.
 

                                                            సాంకేతికతను అందిపుచ్చుకోవాలి..

విజ్ఞాన జ్యోతి ఆచార్య

      రానున్న సంవత్సరాల్లో సాంకేతికతలు పెద్దపెట్టున అభివృద్ధి అవుతాయి. కృత్రిమ మేధ, ఐఓటీ (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌), డిజిటల్‌ సాధనాలు, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీ, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ వంటివి విద్యారంగాన్ని రాజ్యమేలనున్నాయి. కంప్యూటర్‌ ధారాళత, డిజిటల్‌ అక్షరాస్యత, మార్పునకు అనుసరణీయత, సమస్యా పరిష్కారంలో నేర్పరితనం, అధిక ఐక్యూ ఇవి ఉపాధ్యాయులు తమ వృత్తిలో రాణించడానికి తప్పనిసరి. వృత్తి శిక్షణ అవకాశాలను ఉపాధ్యాయులు అందిపుచ్చుకోవాలి. విద్యార్థులకు వారు బోధకులే కాదు, మంచి సదుపాయకర్తలు కావాలి. ఆలోచనలు రేకెత్తించాలి. చక్కటి కథకులుగా మారాలి. సాంకేతికత సాయంతో సమాచారాన్ని విజ్ఞానంగా, ఆ విజ్ఞానాన్ని నైపుణ్యంగా మార్చాలి. సుమారు సంవత్సరంన్నర తర్వాత పాఠశాలలు మరలా తెరుచుకున్నాయి. పిల్లలు, గురువులు ఒకచోట చేరారు. కరోనా బారిన పడకుండా మరెన్నో విజయాలు సాధించాలని మనసారా కోరుకుందాం.

విజ్ఞాన జ్యోతి ఆచార్య

- స్వర్ణలత నూకరాజు