Feb 18,2023 00:11

మాట్లాడుతున్న గీతం విసి దయానంద

ప్రజాశక్తి -మధురవాడ : ప్రజాసంక్షేమంతో పాటు సంపదను సష్టించే ఆర్ధిక వ్యవస్థను రూపొందించాలని, ముఖ్యంగా విజ్ఞాన ఆధారిత ఆర్ధిక ప్రగతి దేశానికి అవసరమని గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ దయానంద సిద్దవటం అభిప్రాయపడ్డారు. ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ ఆంధ్రప్రదేశ్‌, గీతం స్కూల్‌ ఆఫ్‌ హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇండియన్‌ పొలిటికల్‌ ఎకానమీ అసోసియేషన్‌ (ఐపిఇఎ) 26వ వార్షిక సమావేశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అధికారంలోకి రావడానికి ఆర్ధిక వనరులను ఒక ప్రణాళిక లేకుండా ఖర్చు చేయడం సరికాదన్నారు. ఉన్నత విద్య, పరిశోధనా రంగాలకు ౖ నిధుల కేటాయింపు పెరగాలని, దేశంలో మౌలిక సదుపాయాల వృద్ధిపై ప్రభుత్వాలు దష్టి సారించాలని సూచించారు. గీతం ప్రొ వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ వై. గౌతంరావు మాట్లాడుతూ దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరగడంతో రూపాయిపై తీవ్ర ఒత్తిడి ఉందని,ప్రపంచ ఆర్ధిక పరిస్థితులను గమనిస్తూ దేశ ఆర్ధిక ప్రణాళికలలో మార్పులు చేసికోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరుగుతోన్న పరిస్థితుల్లో రాజకీయాలను, ఆర్ధిక రంగాన్ని వేర్వేరుగా చూడలేమని అభిప్రాయ పడ్డారు. గీతం స్కూల్‌ ఆఫ్‌ హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ విశిష్ఠ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కె. చిన్యయ్యసూరి భారతదేశంలో ప్రభుత్వాలు ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపడం సరికాదని, చట్టసభల నిర్వహణ తీరు ప్రజాస్వామ్యం అర్థాన్నే మార్చేశాలా ఉన్నాయని అభిప్రాయ పడ్డారు. ఇండియన్‌ పొలిటికల్‌ ఎకానమీ అసోసియేషన్‌ (ఐపిఇఎ) ఛైర్‌ పర్సన్‌ ప్రొఫెసర్‌ టి. ఉపాధ్యాయ మాట్లాడుతూ రాజకీయ అంశాలను, ఆర్థిక అంశాలను జోడించిన పొలిటికల్‌ ఎకానమీపై అధ్యయనాలు అవసరమని, దీనికి అధ్యాపకులు, విద్యార్థులతో ఐపిఇఎ ద్వారా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో గీతం స్కూల్‌ ఆఫ్‌ హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ బి. నళిని, ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్మెంట్‌ స్టడీస్‌ ఆంధ్రప్రదేశ్‌ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ గాలిబ్‌, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ నాగభూషణరావు, సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ స్టడీస్‌ అండ్‌ ప్లానింగ్‌ ప్రొఫెసర్‌ సురజిత్‌ మజుందార్‌ పాల్గొన్నారు.