వీవోఏ సమస్యల పరిష్కారంకై 36 గంటల ధర్నా
పట్టించుకోకుంటే మరిన్ని పోరాటాలు
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి
ప్రజాశక్తి- తిరుపతి టౌన్
రాష్ట్ర ప్రభుత్వం వీవోఏల పట్ల అనుసరిస్తున్న వైఖరి అన్యాయంగాను, అధర్మంగానూ ఉందని న్యాయమైన వారి సమస్యలను పరిష్కారించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వద్ద జరుగుతున్న 36 గంటల ధర్నాను ఉద్దేశించి కందారపు మురళి మాట్లాడారు. మూడు సంవత్సరాల కాలపరిమితితో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సర్కులర్‌ను రద్దు చేయాలని, జీతాలు పెంచాలని, గ్రూపుల విలీనాన్ని మానుకోవాలని, ఇన్సూరెన్స్ ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఉదయం నుంచి నిరంతరంగా ధర్నా చేస్తున్న వీవోఏలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గతంలో సంఘమిత్ర లుగా, వెలుగు యానిమేటర్లుగా పనిచేసిన వివోఏలు మానసిక సంఘర్షణకు గురవుతున్నారని, చాలీచాలని వేతనాలతో అల్లాడిపోతున్న నేపథ్యంలో సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట 36 గంటల ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వివోఏల పట్ల అనుసరిస్తున్న ధోరణి అన్యాయంగా ఉందని, చాలీచాలని వేతనాలు ఇస్తూ రోజంతా పనులు చేయించు కుంటున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలకు లక్షలలో జీతాలు, కుటుంబం కోసం వత్తిని నమ్ముకుని పనిచేస్తున్న వివోఏలకు చాలీచాలని జీతాలు ఇదెక్కడి దారుణమని ఆయన విమర్శించారు. తక్కువ వేతనాలు ఇస్తూ ప్రభుత్వ పథకాలకు అర్హులు కారంటూ దూరం పెట్టడం ఎంతవరకు సమంజసమా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉన్న నాయకులకు వారి పనుల నిర్వహణకు వివోఏలు మొదట గుర్తొస్తారని, లక్షల మందితో సభలు నిర్వహించడానికి వివోఏలు అవసరమని, వారి జీవితాల్లో ఎదురవుతున్న ఇబ్బందులు మాత్రం పట్టించుకోవడంలేదని దీన్ని సిఐటియు తీవ్రంగా పరిగణిస్తున్నదని అన్నారు. విఓఏల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. బుధవారం మధ్యాహ్నం వివోఏలు కలెక్టరేట్ ఎదుట వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షులు జి.బాలసుబ్రమణ్యం, కార్యదర్శి గురవయ్య, వేణుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో వివోఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగేశ్వరరావు, లక్ష్మి, వేణు, రామయ్య, చాముండేశ్వరి, రాజేశ్వరి, భారతి, షాహిదా, సురేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.










