ప్రజాశక్తి-విజయవాడ అర్బన్: విదేశాలకు వెళ్లే ప్రజలు మోసాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాసరావు సూచించారు. అమెరికాతో పాటు విదేశాల్లో ఉద్యోగాల పేరుతో బ్రోకర్లు తప్పుడు వెబ్సైట్లను సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నారని, అలాంటి వాటి పట్ల ప్రజల్లో అవగాహన పెరగాలని కోరారు. ఇమిగ్రేషన్ లో ఇబ్బందులు పడకుండా తాము న్యాయ వాదులకు అవగాహన కలిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం విజయవాడలో అవగాహనా సదస్సు అనంతరం విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. వివిధ దేశాల ఇమ్మిగ్రేషన్ చట్టాలపై అవగాహన కల్పించడం, న్యాయవాద వత్తిలో ఇమ్మిగ్రేషన్ విభాగంలో ఉపాధి అవకాశాల అవగాహన కోసం మంగళవారం బెజవాడ బార్ అసోసియేషన్, కావేటి లా ఫర్మ్ సంయుక్త ఆధ్వర్యంలో బెజవాడ బార్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ హాల్‌లో సెమినార్ నిర్వహించారు. కావేటి లా ఫర్మ్ అధినేత, ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాసరావు, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కేబి సుందర్, ప్రధాన కార్యదర్శి జె. శ్రీధర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ దేశాల ఇమ్మిగ్రేషన్ చట్టాల తో పాటు ప్రవాస భారతీయుల న్యాయ వివాదాలు, అంతర్జాతీయ న్యాయవాద వత్తిలో స్థిరపడాలని యోచిస్తున్న యువ న్యాయవాదులకు అవగాహన కల్పించారు. ఇంటర్నేషనల్ లా ఫర్మ్ లో ఇంటర్న్ షిప్ అవకాశాలు, విదేశాల్లో స్థిరపడే యోచనలో ఉన్న ఔత్సాహికులకు సరైన మార్గదర్శనం చేసే ఉద్దేశంతో ఈ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని న్యాయవాదులు, ఇమ్మిగ్రేషన్ న్యాయవాద వత్తిలో స్థిరపడాలని యోచిస్తున్న యువ న్యాయవాదులు, విద్య, ఉద్యోగ అవకాశాల ద్వారా విదేశాల్లో స్థిరపడాలని యోచిస్తున్న విద్యార్థులు వారి తల్లితండ్రులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని వివిధ దేశాల ఇమ్మిగ్రేషన్ చట్టాలు, అవకాశాలపై అవగాహన పెంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని శ్రీనివాసరావు తెలిపారు.










