
ప్రజాశక్తి - వీరవాసరం
వీరవాసరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై జిల్లా డిప్యూటీ డిఎంహెచ్‌ఒ భానునాయక్ మంగళవారం విచారణ చేశారు. ముఖ్యంగా హెల్త్ అసిస్టెంట్ శిరిగినీడి సాయిసూర్యరావు ఎఎన్‌ఎంల పట్ల వ్యవహరించిన తీరుపై ఆయన ఆరా తీశారు. కొన్నిరోజుల క్రితం తమ పట్ల సాయిసూర్యరావు అభ్యంతరకరంగా వ్యవహించాడంటూ ఎఎన్‌ఎం ఇ.సంధ్యారాణితో పాటు మరి కొంతమంది సచివాలయ ఎఎన్‌ఎంలు డిఎంహెచ్‌ఒకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్‌ఒ విచారణ చేపట్టి మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రంలో ఎవరికి ఎవరి వల్ల ఎటువంటి ఇబ్బంది ఎదురైందో రాతపూర్వకంగా ఇస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిబంధనలను పక్కనపెట్టి చోటు చేసుకున్న పరిణామాల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి పరిధిలో వారు విధులు నిర్వర్తించాలన్నారు. సక్రమంగా విధులు నిర్వర్తించనివారిపై చర్యలు తప్పవన్నారు. లెప్రసీ సెంటర్‌లో పని చేస్తున్న వైద్య సిబ్బందిని ఆదర్శంగా తీసుకుని పని చేయాలన్నారు. డేటా ఎంట్రి ఆపరేటర్‌గా సాయిసూర్యరావును ఆరోగ్య కేంద్రంలో ఏ అధికారంతో నియమించారంటూ వైద్యులు సత్యనారాయణరాజును ప్రశ్నించారు. దళిత ఉద్యోగుల పట్ల వ్యవహరించే తీరులో తేడా వస్తే సహించేదిలేదని దళిత నాయకుడు కోరం ముసలయ్య హెచ్చరించారు. అధికారుల మద్దతుతోనే సాయి సూర్యరావు కొంతమందిపై దురుసుగా ప్రవర్తించాడంటూ ఆరోపించారు. తప్పనిసరిగా అతనిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని వైధ్యాధికారులను కోరారు.