
ప్రజాశక్తి - భీమవరం రూరల్
స్వాతంత్య్ర సమరంలో ప్రాణ త్యాగాలు చేసిన వీరులను స్మరించుకుంటూ వారి స్ఫూర్తిని పొందాలని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. నా మట్టి - నా దేశం కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో క్విట్ ఇండియా స్వాతంత్రోద్యమ అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించిన వీరులకు వందనం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నా మట్టి-నా దేశం కార్యక్రమంలో భాగంగా ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి 20వ తేదీ వరకు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. తొమ్మిదో తేదీన పంచాయతీ కార్యాలయాల ఆవరణలో అమరవీరులను స్మరించుకుంటూ శిలాఫలకాలను ఆవిష్కరించినట్లు చెప్పారు. పదో తేదీన పంచ ప్రాణ ప్రతిజ్ఞ, 11న వసుధకు వందనం పేరుతో మొక్కలు నాటినట్లు తెలిపారు. శనివారం వీరులకు వందనం పేరుతో వారిని స్మరించుకుంటూ, వారి కుటుంబ సభ్యులను సన్మానించినట్లు చెప్పారు. 16వ తేదీ నుంచి 20 మండలాలు, మున్సిపాలిటీల్లో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పలు కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. తొలుత అమరవీరులను స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. క్విట్ ఇండియా స్వాతంత్రోద్యమ అమరవీరుల స్థూపం పున:నిర్మాణ కమిటీ సభ్యులు యిందుకూరి ప్రసాదరాజు, చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజు, అరసవల్లి బాల సుబ్రహ్మణ్యం, బొండా వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో పలువురి దాతల సహకారంతో సుమారు రూ.7.50 లక్షలతో క్విట్ ఇండియా స్థూపం పున:నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. మెయిన్ రోడ్డు వైపు స్థూపం స్పష్టంగా కనిపించేలా ఆర్చి, స్టీల్ గేటు ఏర్పాటుకు ఓబిలిశెట్టి పట్టాభి రామయ్య రూ.1.50 లక్షలు విరాళం అందించారన్నారు. స్వాతంత్ర సమరయోధులు పస్తుల సాగర్ మనవడు పస్తుల హరిప్రసాద్, అడవి బాపిరాజు మనవడు కెకెఆర్.కృష్ణమోహన్‌లను కలెక్టర్ చేతులమీదుగా శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్‌డిఒ దాసిరాజు, డ్వామా పీడీ ఎస్‌టివి.రాజేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి జివికె.మల్లికార్జునరావు, మున్సిపల్ కమిషనర్ ఎస్.శ్యామల, తహశీల్దార్ రవికుమార్, ఎంపిడిఒ కె.వెంకటలక్ష్మి, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, డిఎన్‌ఆర్ కాలేజీ వైస్ ప్రెసిడెంట్ జి.పాండురంగరాజు, బిఎస్‌కె కాలేజీ సెక్రటరీ వి.పట్టాభిరామయ్య, రోటరీ క్లబ్ ప్రతినిధులు బివి.సుబ్బారావు, జయవర్మ, విజ్ఞాన వేదిక వైస్ ప్రెసిడెంట్ యిందుకూరి శివాజీ వర్మ, మెంబర్ అల్లు శ్రీనివాస్, డిఎన్‌ఆర్ కాలేజీ ఎన్‌సిసి క్యాడెట్స్, విఆర్‌ఒలు పాల్గొన్నారు.