ప్రజాశక్తి-యంత్రాంగం :
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ప్రథమ వర్థంతిని విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పలుచోట్ల సోమవారం ఘనంగా నిర్వహించారు.
కలెక్టరేట్, విశాఖ : ఐద్వా, శ్రామిక మహిళా సమన్వయ (సిఐటియు) విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యాన మల్లు స్వరాజ్యం ప్రథమ వర్థంతి సభ జగదాంబ సమీపంలోని సిఐటియు కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐద్వా విశాఖ జిల్లా అధ్యక్షులు బి.పద్మ మాట్లాడుతూ, పేద ప్రజల సమస్యల విముక్తి కోసం పోరాడిన వీరనారి మల్లు స్వరాజ్యం అని చెప్పారు. పోరాట మార్గమే నిజమైన విముక్తికి దారి తీస్తుందని నమ్మిన గొప్ప పోరాట యోధురాలు అన్నారు. భూమికోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం జరిగిన పోరాటానికి ఆమె నాయకత్వం వహించారన్నారు. ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేసినప్పుడే మనమిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి వై.సత్యవతి, జిల్లా నాయకులు వరలక్ష్మి, కె.మణి, బి.భారతి, డి.కొండమ్మ, కె.కుమారి, విమల, సిఐటియు జిల్లా కార్యదర్శి పి.మణి, జిల్లా నాయకులు కె.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
పెందుర్తి : 96వ వార్డు పరిధి పెందుర్తి సిఐటియు కార్యాలయంలో ఐద్వా, సిఐటియు ఆధ్వర్యాన మల్లు స్వరాజ్యం ప్రథమ వర్థంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు సీనియర్ నాయకులు బిటి.మూర్తి మాట్లాడుతూ, భూస్వామ్య కుటుంబంలో పుట్టి పేద ప్రజల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి మల్లు స్వరాజ్యం అన్నారు. ఐద్వా నాయకులు బి.రమణి మాట్లాడుతూ, నాటి రోజుల్లో తుపాకి పట్టి గడగడ లాడించిన వీర వనిత అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శంకరరావు, సూర్యప్రకాష్, అప్పారావు, జగన్నాథ్ స్వామి, ఎస్.శంకరరావు, జయబాబు తదితరులు పాల్గొన్నారు.
ములగాడ : జివిఎంసి 58వ వార్డు పరిధి గుల్లలపాలెంలో మల్లు స్వరాజ్యం చిత్రపటానికి ఐద్వా జోన్ అధ్యక్షులు బి.మమత, నాయకులు కృష్ణవేణి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. సారా వ్యతిరేక ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ఎజెండాగా మార్చడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆమె ఆశయ సాధనలో మహిళలంతా ఐక్యంగా పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరమ్మ, నిర్మల, వరలక్ష్మి మహిళలు పాల్గొన్నారు.
సబ్బవరం : తెలంగాణ సాయుధ పోరాట ధీర వనిత మల్లు స్వరాజ్యం ప్రథమ వర్థంతి వేడుకలు స్థానిక దుర్గమాంబ ముఠా కళాసి సంఘం కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షరాలు బి.ప్రభావతి ముఖ్య అతిథిగా పాల్గొని మల్లు స్వరాజ్యం చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వరాజ్యం పేదలకు భూములు కోసం, భుక్తి కోసం సాయుధ దళంలో తుపాకీ పట్టి పోరాటం చేసిన వీర వనిత అని తెలిపారు. ఆమె తనకున్న భూములను పేదలకు ధారాదత్తం చేసిన మహా త్యాగి అని పేర్కొన్నారు. మహిళా హక్కులకోసం అహర్నిశలు కృషి చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు ఉప్పాడ సత్యవతి ఎం.గౌరీశ్వరరావు, యర్రా సోంబాబు, అప్పారావు, వరలక్ష్మి పాల్గొన్నారు.










