Feb 13,2022 11:29

గుమ్మడి ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగని గుమ్మడికాయ వంటలను ఇష్టపడేవాళ్లు ఎంతమంది? దాని పేరు చెబితేనే మాకొద్దు అంటూ పారిపోతారు. అందుకే అలాంటివారూ ఇష్టంగా తినేలా గుమ్మడితో కొన్ని వెరైటీ వంటలు ఇస్తున్నాం. ఇంకెందుకాలస్యం వెంటనే వండేసుకుని ఆ రుచిని ఆస్వాదించండి.

                                                                     హల్వా

 హల్వా

కావాల్సిన పదార్థాలు : గుమ్మడికాయ - కేజీ, దాల్చినచెక్క-కొద్దిగా, పంచదార- 150 గ్రా., నూనె లేక నెయ్యి - నాలుగు స్పూన్లు, ఎండుద్రాక్ష -50 గ్రా., కొబ్బరి తురుము - రెండు స్పూన్లు, బాదం - రెండు స్పూన్లు.
 

తయారుచేసే విధానం :

  • ముందుగా గుమ్మడికాయ పొట్టు తీయాలి.
  • కొబ్బరి తురుము, బాదం వేగించి పొడి చేసుకోవాలి.
  • ఒక పాత్రలో గుమ్మడికాయ, దాల్చిన చెక్క తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి, మూత పెట్టి ఉడికించాలి.
  • తర్వాత నీళ్లన్నీ తీసేసి గుమ్మడికాయను గుజ్జుగా చేయాలి.
  • పాన్‌లో నూనె వేసి కాస్త వేడయ్యాక, గుమ్మడికాయ గుజ్జు వేసి, పదినిమిషాల పాటు వేగించాలి.
  • ఇప్పుడు సరిపడా పంచదార వేయాలి. మిశ్రమం చిక్కగా అయ్యే వరకు ఉంచాలి.
  • అందులోనే కొబ్బరి తురుము, బాదం వేయాలి. ఎండుద్రాక్ష వేసి సర్వ్‌ చేసుకోవాలి.


                                                                   పూర్ణాలు..

 పూర్ణాలు..

కావాల్సిన పదార్థాలు : తీపి గుమ్మడికాయ తురుము - కప్పు, బెల్లం తురుము - కప్పు, నెయ్యి - పావు కప్పు, మినపప్పు - కప్పు, బియ్యం - రెండు కప్పులు, యాలకుల పొడి - స్పూను, జీడిపప్పు పలుకులు - టీస్పూను, ఉప్పు - చిటికెడు, నూనె - సరిపడినంత.
 

తయారుచేసే విధానం :

  • బియ్యం, మినపపప్పు కలిపి నాలుగ్గంటల పాటూ నానబెట్టాలి. తర్వాత మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు గుమ్మడి పండు తురుమును ఒక వస్త్రంలో మూటలా కట్టి, దానిపై కాస్త బరువుపెట్టాలి.
  • అప్పుడు అందులోని నీరు బయటికిపోతుంది.
  • తర్వాత స్టవ్‌ మీద పాన్‌ పెట్టి, కొద్దిగా నెయ్యి వేయాలి. అందులో జీడిపప్పు పలుకులు వేగించి, పక్కన పెట్టుకోవాలి.
  • అందులోనే మరికొంచెం నెయ్యి వేసి, గుమ్మడి తురుము వేసి వేయించాలి. తురుము పచ్చి వాసన పోయే వరకు ఉంచాలి.
  • తర్వాత అందులో బెల్లంతురుము వేసి బాగా కలపాలి.
  • బెల్లం కరిగాక తురుముతో కలిసి మళ్లీ గట్టిపడుతుంటుంది. అప్పుడు యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు వేయాలి.
  • ఆ మిశ్రమం చల్లారిన తర్వాత పూర్ణాల్లా గుండ్రంగా చుట్టుకోవాలి.
  • తర్వాత స్టవ్‌మీద పాన్‌పెట్టి, వేయించడానికి సరిపడా ఎక్కువ నూనె పోసి, వేడి చేయాలి.
  • ఆ పూర్ణాలని ముందుగా రుబ్బి పెట్టుకున్న బియ్యం- మినపప్పు మిశ్రమంలో ముంచి తీసి, నూనెలో వేసి, వేగించాలి. బంగారు వర్ణంలోకి రాగానే వాటిని తీసెయ్యాలి.
  • అంతే గుమ్మడి పూర్ణాలు రెడీ.


                                                                    కేక్‌

  కేక్‌

కావాల్సిన పదార్థాలు :  మైదాపిండి- రెండున్నర కప్పులు, బేకింగ్‌ పౌడర్‌- టీస్పూను, దాల్చిన చెక్కపొడి- అర టీస్పూను, అల్లం పేస్టు- పావు టీస్పూను, జాజికాయ పొడి- అర టీస్పూను, గుమ్మడికాయ గుజ్జు- కప్పు, అరటిపండు గుజ్జు-కప్పు, పంచదార-అరకప్పు, తేనె- అరకప్పు, ఆవనూనె- పావుకప్పు, గుడ్లు-రెండు, వాల్‌ నట్‌- ముప్పావు కప్పు, ఉప్పు- తగినంత.
 

తయారుచేసే విధానం :

  • ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో మైదా పిండి, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు, దాల్చిన చెక్క, జాజికాయ పొడి ఒక దాని తరువాత ఒకటి వేసు కుని బాగా కలుపుకోవాలి.
  • తర్వాత అల్లం పేస్టు, అరటిపండు గుజ్జు, గుమ్మడి కాయ గుజ్జు, పంచదార, తేనె, ఆవనూనె, గుడ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు కేక్‌ మేకర్‌ బౌల్‌లో ఆ మిశ్రమం మొత్తాన్ని వేసుకుని దానిపై వాల్‌నట్‌ తురుముని వేసుకుని నలభైౖ నిముషాల పాటు ఉడకనివ్వాలి.
  • చల్లారిన తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్‌ చేసుకుంటే ఎంతో రుచికర మైన గుమ్మడికాయ కేక్‌ రెడీ.


                                                                        పచ్చడి

పచ్చడి

కావాల్సిన పదార్థాలు : తీపి గుమ్మడికాయ - 300 గ్రా., పసుపు- అర టీస్పూను, బెల్లం తరుగు- రెండు టీస్పూన్లు, ఉప్పు - తగినంత.
మసాలా కోసం : తాజా కొబ్బరి తురుము - అరకప్పు, పచ్చిమిర్చి - ఒకటి, అల్లం తురుము - టీస్పూను, కరివేపాకు- రెండు రెమ్మలు.
పోపు కోసం : నూనె - టీ స్పూను, ఆవాలు - అర టీస్పూను, మినప్పప్పు- అర టీ స్పూను, కరివేపాకు- రెండు రెమ్మలు.
 

తయారుచేసే విధానం :

  • గుమ్మడికాయను శుభ్రంగా కడిగి, పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి.
  • స్టౌ మీద కుక్కర్‌లో గుమ్మడికాయ ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టాలి. ఒక విజిల్‌ రాగానే దింపేసి, కుక్కర్‌ మీద చల్లటి నీళ్లు పోసి, మూత తీసేయాలి.
  • గుమ్మడికాయ ముక్కలను ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి.
  • మసాలా కోసం తీసుకున్న పదార్థాలను మిక్సీలో వేసి, కొద్దిగా మెత్తగా చేసి, బయటకు తీయాలి. అందులోనే గుమ్మడికాయ ముక్కలకు జత చేయాలి.
  • స్టౌ మీద పాన్‌లో నూనె వేసి కాగాక, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించి, పచ్చడి మీద వేసి కలియబెట్టాలి.
  • ఈ పచ్చడి అన్నంలోకి రుచిగా ఉంటుంది.