Apr 09,2023 21:34

ప్రభుత్వ హామీలు బుట్టదాఖలు
రెండు జిల్లాల్లోనూ అమలు కాని వీక్లీఆఫ్‌
'పశ్చిమ' ఎస్‌పి ఆదేశాలిచ్చినా స్టేషన్‌ అధికారులు బేఖాతరు
గుగూల్‌ షీట్‌లో వీక్లీఆఫ్‌ లెక్కల మాయాజాలం
చూసీచూడనట్లుగా స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు
మహిళా పోలీసులకు అనధికారిక విధులు?
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

పోలీస్‌ సిబ్బందికి ప్రకటించిన వీక్లీఆఫ ్‌(వారాంతపు సెలవు) ఇప్పటికీ అమలుకాని పరిస్థితి నెలకొంది. 'దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు' అనే చందంగా పోలీసుల వీక్లీ ఆఫ్‌ తయారైంది. పోలీస్‌ ఉద్యోగం నిత్యం ఒత్తిడితో కూడుకున్నది. ఒత్తిడిని తగ్గించి కుటుంబంతో గడిపేందుకు వీక్లీ ఆఫ్‌ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలీసులకు వారాంతపు సెలవు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించి ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ప్రభుత్వం అధికారంలోకొచ్చి నాలుగేళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ పోలీసుల వీక్లీఆఫ్‌ సక్రమంగా అమలుకాని పరిస్థితి నెలకొంది. కొన్ని జిల్లాల్లో ఎస్‌పిలు వీక్లీ ఆఫ్‌ ఆమలుపై ఆదేశాలిచ్చినా స్టేషన్‌ అధికారులైన సిఐ, ఎస్‌ఐలు అమలు చేయని పరిస్థితి ఉంది. రెండు జిల్లాల్లోనూ దాదాపు 2500 మంది వరకూ పోలీస్‌ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారంలో ఒకరోజు వీరికి వీక్లీ ఆఫ్‌ అమలు చేయాల్సి ఉంది. రెండు జిల్లాల్లోనూ ఎక్కడా అమలు కావడం లేదు. పశ్చిమగోదావరి జిల్లాలో వీక్లీఆఫ్‌ అమలుపై ఎస్‌పి రవిప్రకాష్‌ ఆదేశాలచ్చినా అమలు చేయని దుస్థితి నెలకొంది. సిబ్బందికి వీక్లీ ఆఫ్‌ వివరాలను ప్రతిరోజూ గూగుల్‌ షీట్‌లో నమోదు చేయాలని ఎస్‌పి ఆదేశించారు. సిబ్బందికి వీక్లీఆఫ్‌ ఇవ్వకపోయినా గూగుల్‌ షీట్‌లో నమోదు చేస్తూ ఉన్నతాధికారులను ఏమారుస్తున్నట్లు తెలిసింది. ఎస్‌పికి రెండు కళ్లలా వ్యవహరించాల్సిన స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు సైతం ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియపరచకపోవడం ఆశ్చర్యం కల్గిస్తోంది. గూగుల్‌ షీట్‌లో నమోదు చేసిన తర్వాత వీక్లీ ఆఫ్‌ ఇవ్వకపోవడంపై సిబ్బందిలోనూ తీవ్ర ఆవేదన నెలకొంది. వీక్లీఆఫ్‌ అమలులో కొనసాగుతున్న నిర్లిప్తతను సిబ్బంది మౌనంగా భరిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేక, స్టేషన్‌ అధికారులను అడగలేక సతమతమవుతున్న పరిస్థితి ఉంది. పోలీసులకు వీక్లీ ఆఫ్‌ అమలుపై ప్రభుత్వం సైతం కచ్చితమైన ఆదేశాలు జారీ చేసి అమలు చేసేలా పర్యవేక్షించాలని సిబ్బంది కోరుతున్నారు.
అనధికారికంగా మహిళా పోలీసులకు విధులు
మహిళా పోలీసులుగా పిలుస్తున్న (సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శులు)కు పోలీస్‌ అధికారులు అనధికారికంగా విధులు కేటాయిస్తున్నారు. నిబంధనల ప్రకారం మహిళా పోలీసులకు బందోబస్తు విధులు కేటాయించకూడదు. సచివాలయ ఉద్యోగులకు వర్తించే సెలవులు, కార్యాలయానికి వచ్చే సమయానికి సంబంధించిన నిబంధనలే వీరికి వర్తిస్తాయి. అయితే మహిళా పోలీసులకు నిబంధనలకు విరుద్ధంగా విధులు కేటాయిస్తూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మహిళా పోలీసులకు బందోబస్తు విధులు కేటాయించబోమని ప్రభుత్వం కోర్టుకు సైతం తెలిపింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా సాగుతోంది. సిఎం పర్యటనలు, ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగ రాత పరీక్షల కేంద్రాల వద్ద బందోబస్తుకు మహిళా పోలీసులను ఉపయోగిస్తున్నారు. నిబంధనల ప్రకారం బందోబస్తు విధులు నిర్వహించే పోలీసులకు టిఎ, డిఎలు వర్తిస్తాయి. సిఎం పర్యటన మధ్యాహ్నానికి అయిపోతే పోలీస్‌ సిబ్బంది నేరుగా ఇంటికి వెళ్లిపోతారు. అదే మహిళా పోలీసులైతే సచివాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇంటికెళ్తే పంచాయతీ కార్యదర్శి ఊరుకోరు. మహిళా పోలీసులకు అనధికారికంగా విధులు కేటాయించడం వల్ల ఏఒక్క సౌకర్యమూ వీరికి వర్తించడం లేదు. దీంతో ఛార్జీల వంటి ఖర్చులు సొంతంగానే భరించాల్సిన దుస్థితి నెలకొంది. పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులకు విధులు కేటాయించాలి. అయితే ప్రస్తుతం ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఒకరిద్దరు మహిళా పోలీసులకు విధులు కేటాయించారు. పోలీస్‌ సిబ్బందికి విధుల కేటాయింపునకు సంబంధించి ఇచ్చే పాస్‌పోర్టు వంటివేమీ వీరికి ఇవ్వడం లేదు. సచివాలయ ఉద్యోగులు ఉదయం పది గంటలకు విధులకు హాజరుకావాలి. అయితే మహిళా పోలీసులను ఉదయం ఎనిమిదిగంటలకే పరీక్షా కేంద్రాల వద్దకు పంపిస్తున్నారు. మధ్యాహ్నం రెండుగంటల వరకూ విధులు నిర్వహించి మళ్లీ సచివాలయానికి వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు అర్ధరాత్రి వరకూ కూడా విధులు నిర్వహించాల్సి వస్తోంది. మహిళా పోలీసుల విధుల విషయంలో స్టేషన్‌ అధికారులు తీరు వివాదాస్పదంగా మారుతోంది. మహిళా పోలీసుల విధుల విషయంలోనూ జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని నిబంధనలు అమలు చేయాలని అంతా కోరుతున్నారు.