May 31,2023 23:59

నిరసన తెలుపుతున్న వీధి వర్తకులు

ప్రజాశక్తి -మధురవాడ : ప్రభుత్వాలపై ఆధారపడకుండా చిల్లర వర్తకం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న వ్యాపారులపై జివిఎంసి దాడులు చేసి నష్టపరచడం అన్యాయమని, వీధి వర్తకులకు రక్షణ కల్పించాలని సిఐటియు మధురవాడ జోన్‌ కమిటీ ఉపాధ్యక్షులు డి.అప్పలరాజు డిమాండ్‌చేశారు. జివిఎంసి 7వ వార్డు పరిధి మిథిలాపురి ఉడాకాలనీ ప్రధాన రహదారిలో సుమారు 15 సంవత్సరాలుగా చిల్లర వర్తకం చేసుకుంటూ జీవిస్తున్న 60మందిపై ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ, తొలగిస్తూ తీవ్ర వేదనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మూడు రోజుల నుంచి ప్రతి రోజూ దాడులు చేస్తున్నారని తెలిపారు. ఈ దాడులను నిరసిస్తూ ఉడాకాలనీ రోడ్డులో బుధవారం ఆందోళన చేపట్టారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ చిరు వ్యాపారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ, రోడ్ల పక్కన తోపుడు బండ్లు, బల్లలు, తట్టలు, ఇతర పరికరాలతో వర్తకం చేసుకుంటున్నారని తెలిపారు. ఇటువంటి వారిని అన్ని విధాలా ఆదుకోవాల్సిన ప్రభుత్వం, అధికారులు దాడులు చేయడం అన్యాయమన్నారు. దాడుల ఆపి వర్తకం చేసుకునే విధంగా జివిఎంసి, పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జోన్‌ నాయకులు కె.పాపినాయుడు, వర్తకులు ఎం.ఆదినారాయణ, చందు, కె.కామేశ్వరరావు, శారద, కొండమ్మ, శ్రీను, కె.కృష్ణ, వై.రాంబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.