- ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని కార్పొరేటర్ల నిరసన
- విఎంసి విఎఎస్‌పై ఎమ్మెల్యే విష్ణు ఆగ్రహం
ప్రజాశక్తి-విజయవాడ: నగరంలోని చిన్నారులు, పెద్దలపై దాడి చేస్తూ గాయపరుస్తున్న వీధి కుక్కలను కూడా నియంత్రించలేని స్థితిలో నగరపాలక సంస్థ పాలకవర్గం ఉందని ప్రజల నుంచి మాట పడాల్సి వస్తోందని పార్టీలకతీతంగా కార్పొరేటర్లందరూ ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో వీధి కుక్కల బెడదపై సోమవారం జరిగిన విఎంసి కౌన్సిల్లో పెద్ద దుమారం రేగింది. వీధి కుక్కల నియంత్రణ బాధ్యత పర్యవేక్షించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (విఎఎస్) డాక్టర్ ఎ రవిచంద్ పొంతన లేని, బాధ్యతారాహిత్యమైన సమాధానాలు చెప్తున్న క్రమంలో ఎమ్మెల్యే విష్ణు మండిపడ్డారు. నగరానికి దూరంగా కొండ ప్రాంతంలో పది ఎకరాల స్థలాన్ని సేకరించి, నగరంలోని వీధి కుక్కలను అక్కడకు పంపించే ఏర్పాటు చేస్తే కొంత కుక్కల బెడద తగ్గుతుందని ఎమ్మెల్యే చేసిన సూచనలకు ఎక్కువ మంది కార్పొరేటర్లు ఒకే చెప్పగా, ఇటువంటి చర్యల వల్ల ఉపయోగం ఉండకపోవచ్చునని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. కుక్కల బెడద నివారణకు వైసిపి, టిడిపి, సిపిఎం సభ్యులతో కూడిన ఒక కమిటీని వేసి, దానిలో సమగ్రంగా చర్చించి, నిర్ణయం తీసుకొని దాని ప్రకారం ముందుకు పోవాలని కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది. 57వ డివిజన్ కొత్త ఆర్‌ఆర్‌పేట జీరో బల్ప్ రైల్వే ట్రాక్ నుంచి బుడమేరు రైల్వే బ్రిడ్జీ వరకు రైల్వే ట్రాక్ వెంబడి ఆర్‌సిసి స్టార్మ్ వాటర్ డ్రైయిన్ నిర్మాణానికి మూడుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడం దారుణమని, స్ట్రామ్ వాటర్ డ్రైనేజి స్కీమ్ కింద విఎంసికి కేంద్రం మంజూరుచేసి, రాష్ట్రం వద్ద పెండింగ్‌లో ఉన్న రూ.289 కోట్ల నిధులను తీసుకొస్తే ఈ సమస్య ఉండేదని కాదని సిపిఎం ప్లోర్‌లీడర్ సత్యబాబు కౌన్సిల్‌లో మండిపడ్డారు. ఇదే అంశంపై టిడిపి ప్లోర్‌లీడర్ బాలస్వామి అధికార వైసిపి వైఖరిని తప్పుపట్టారు. వీధి కుక్కల నియంత్రణకు విఎంసి పిలిచిన ఎన్‌జిఒ సంఘానికి ఇవ్వాల్సిన రూ.70 లక్షలు ఇవ్వలేని దుస్థితిలో విఎంసి ఉండగా, సర్కిల్-1 పరిధిలో ఆర్‌అండ్‌బికి చెందిన కేదారేశ్వరపేట నుంచి చిట్టినగర్ జంక్షన్ వరకు ఉన్న రోడ్డు నిర్మాణానికి రూ. కోటి అప్పుగా ఇవ్వడానికి విఎంసి ఎక్కడి నుంచి తెచ్చి చెల్లిస్తుందని ప్రశ్నించారు. అజెండాలో తాను పెట్టిన పలు ప్రతిపాదనలపై మాట్లాడనీయకుండా అధికార వైసిపి ఎదురుదాడి చేయడమే కాకుండా, పాఠం చదువుకుంటూ వెళ్తున్న అధికారపార్టీ ప్లోర్‌లీడర్ వైఖరికి నిరసనగా కౌన్సిల్ మధ్యలో సిపిఎం ప్లోర్‌లీడర్ బ్లాక్ టీషర్ట్ ధరించడంపై అధికార వైసిపి సభ్యులు ఎదురు దాడికి దిగారు. విఎంసికి రావాల్సిన రూ. 150 కోట్ల స్పెషల్ గ్రాంట్‌ని ధులను మంజూరు చేయించాలని, పిపిపి వద్దు...విఎంసి ముద్దు అని, జగనన్న ఇళ్లను ఉచితంగా నిర్మించి ఇవ్వాలని కోరుతూ కౌన్సిల్ సమావేశానికి ముందు టిడిపి, సిపిఎం సభ్యులు విఎంసి ప్రాంగణంలోని ఎస్‌బిఐ బ్యాంక్ సెంటర్ నుంచి కౌన్సిల్ హాలు వరకు బ్యానర్ చేతబూని నినాదాలు చేసుకుంటూ ప్రదర్శన నిర్వహించారు.










