May 01,2023 22:29

పంటలు తడిసి రైతులు లబోదిబో - అన్నదాత పరిస్థితి మరింత దారుణం
ప్రజాశక్తి - విలేకరులు

             వర్షాలు రైతులను వెంటాడుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకూ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. పలుచోట్ల భారీవర్షం కురిసింది. దీంతో చేతికొచ్చిన వరి, మొక్కజొన్న, వేరుశనగ పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. మాసూళ్లు పూర్తయిన ధాన్యపు రాశులు తడిసిపోయి రైతులు లబోదిబోమంటున్నారు. పలుచోట్ల ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయి.
భీమడోలు:ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. రవాణాకు సిద్ధం చేసిన ధాన్యంతో పాటు, అమ్మకానికి సిద్ధం చేసిన ధాన్యం సైతం తడిసిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సోమవారం ఉదయానికి మండలంలో 15.40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనాల మేరకు రాత్రి కురిసిన వానలకు 2500 టన్నుల వరకఊ రవాణాకు సిద్ధం చేసిన ధాన్యం తడిసినట్లు అంచనావేశారు. రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు టార్పాలిన్లు, బరకాల కోసం పరుగులు తీస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
      ఉంగుటూరు : సోమవారం తెల్లవారు జాము నుంచి మండలంలో కుండపోత వర్షం కురిసింది. ధాన్యం రాశులు తడిసిపోయాయి. అనేక గ్రామాల్లో కల్లాల్లో ఉన్న ధాన్యం రాశుల చుట్టూ నీరు చేరింది. వాటి చుట్టూ రైతులు గాడిలాంటివి ఏర్పాటు చేసుకుంటూ.. నీటిని తోడుకుండా నానా అవస్థలు పడ్డారు. సుమారు 30 ఎకరాల్లో ధాన్యం తడిసినట్లు ప్రాథమిక అంచనా వేశామని వ్యవసాయాధికారులు వెల్లడించారు.
     జీలుగుమిల్లి:మండలవ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకూ ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల చేతికి వచ్చిన వరి, మొక్కజొన్న, వేరుశనగ పలు పంటలు తడిసిపోయాయి. మరో రెండురోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
    మండవల్లి:మండలంలో సోమవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో భారీ వర్షంకురిసింది. దీంతో మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండవల్లిలో బిసి, ఎస్‌సి కాలనీలతో పాటు దళితవాడ, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. మురుగనీరు, వర్షపు నీరు ఏకమై రోడ్లపైకి చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. మరో మూడురోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మురుగునీటితో దోమలు వ్యాప్తిచెంది వ్యాధులు ప్రబలకుండా మురుగునీటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
     ముదినేపల్లి : ముదినేపల్లిలో మూడు రోజులుగా తరచూ వర్షం కురుస్తూనే ఉంది. పలుచోట్ల డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపునీటితో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోమవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులు, భీకర గాలులతో వర్షం పడింది. సుమారు ఐదు గంటల పాటు కురిసిన వర్షం ముదినేపల్లిని ముంచెత్తింది. రోడ్లపై మోకాళ్లలోతు నీరు చేరింది. మండలంలోని పెయ్యేరులోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లల్లోకి వర్షపునీరు చేరింది.