రెండో ఎంఎల్‌సి పదవిపై అధికార పార్టీలో రచ్చ
ఒకటి జయమంగళకు ఖాయమని ప్రచారం
రెండో ఎంఎల్‌సి పదవి కోసం నేతల్లో గట్టి పోటీ
ప్రముఖంగా గుణ్ణం, వంకా పేర్లు, జాబితాలో మరికొందరు
రేపు అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
ఎంఎల్‌సి పదవి నాకు కావాలంటే.. నాకు కావాలంటూ అధికార పార్టీ నాయకులు పోటీ పడుతున్నారు. ఈ నెల 23వ తేదీ నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఆశావహులంతా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికలకు సంబంధించి జిల్లాలో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఎంఎల్‌సి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆశావహులంతా టిక్కెట్ కోసం అధినాయకత్వం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఒక పదవి బిసికి, మరో పదవి జనరల్‌కు ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే టిడిపికి చెందిన కైకలూరు మాజీ ఎంఎల్‌ఎ జయమంగళ వెంకటరమణను వైసిపిలోకి ఆహ్వానించి ఎంఎల్‌సి పదవి ఇచ్చేందుకు అధినాయకత్వం సిద్ధమైంది. దీంతో బిసికి ఇస్తామన్న పదవిపై స్పష్టత వచ్చినట్లయ్యింది. మరో పదవికి సంబంధించి పలువురి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ పదవి ఆశిస్తున్న నాయకులు ఉమ్మడి జిల్లాలో దాదాపు 15 మందికిపైగా ఉన్నారు. వీరంతా ఎంఎల్‌సి పదవి తమకే వస్తుందని చెబుతున్న పరిస్థితి నెలకొంది. దీనిలో ప్రముఖంగా పాలకొల్లుకు చెందిన గుణ్ణం నాగబాబు, తణుకుకు చెందిన వంకా రవీంద్ర పేర్లు విన్పిస్తున్నాయి. గుణ్ణం నాగబాబుకు దాదాపుగా ఎంఎల్‌సి పదవి ఖాయమైనట్లు పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే గుణ్ణంకు పదవి ఇవ్వడాన్ని చాలా మంది నాయకులు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. గుణ్ణం నాగబాబు 2019 ఎన్నికల ముందు వైసిపి నుంచి జనసేనలోకి వెళ్లి ఎంఎల్‌ఎ అభ్యర్ధిగా పోటీ చేశారు. గుణ్ణం నాగబాబు పోటీ చేయకపోతే పాలకొల్లులో వైసిపి అభ్యర్థి గెలిచేవారని వైసిపి నేతల అభిప్రాయం. ఎన్నికల తర్వాత కొంతకాలానికి నాగబాబు మళ్లీ వైసిపిలో చేరారు. పార్టీ నుంచి వెళ్లిపోయి తిరిగొచ్చిన వ్యక్తికి ఏవిధంగా ఎంఎల్‌సి పదవి ఇస్తారని అంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో నరసాపురం ఎంపీగా వైసిపి నుంచి పోటీ చేసి ఆర్ధికంగా వంకా రవీంద్ర తీవ్రంగా నష్టపోయారు. తనకే ఎంఎల్‌సి పదవి ఇవ్వాలని ఆయన గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే డెల్టా ప్రాంతానికి అనేక కీలక పదవులు కట్టబెట్టారని, మెట్ట ప్రాంతానికి ఎంఎల్‌సి ఇవ్వాలని ఈ ప్రాంత నాయకులు పట్టుబడుతున్నారు. కమ్మ సామాజిక తరగతికి చెందిన నల్లజర్లకు చెందిన కారుమంచి రమేష్ ఎంఎల్‌సి పదవి కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు పదవి ఇస్తే మెట్ట ప్రాంతంలో నాలుగైదు నియోజకవర్గాల్లో పార్టీకి సానుకూలత వస్తుందనే అభిప్రాయం వైసిపిలో వ్యక్తమవుతోంది. గుణ్ణం నాగబాబు, వంకా రవీంద్ర, కారుమంచి రమేష్ పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పదవి ఎవరిని వరిస్తుందోననేది సస్పెన్స్ నెలకొంది.
గుణ్ణంకు ఇస్తే పోటీనే అంటూ హెచ్చరికలు
గుణ్ణం నాగబాబుకు ఎంఎల్‌సి పదవి ఇస్తే తాము అంగీకరించబోమని, స్వతంత్ర అభ్యర్ధిగా పోటీకి దిగుతామని పాలకొల్లుకు చెందిన మరో నాయకుడితోపాటు, ఆశావహులు అధిష్టానానికి తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. అదే జరిగితే పార్టీకి తీవ్ర ఇబ్బంది ఏర్పడే పరిస్థితి రానుంది. వైసిపి నుంచి రెబల్ అభ్యర్ధి పోటీలోకి దిగితే ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది. పదవి ఆశిస్తున్న వారిని అధిష్టానం ఏవిధంగా బుజ్జగిస్తుందో వేచిచూడాలి. సోమవారం ఎంఎల్‌సి అభ్యర్థుల జాబితాను వైసిపి ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పటి వరకూ ఉత్కంఠ తప్పదని చెప్పొచ్చు.










