ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాలను ముసురు వెంటాడుతోంది. రోజులుగా ఇదే వాతావరణం నెలకొంది. బుధవారం నుంచి శనివారం వరకు జల్లులు, ఒక మోస్తరుగా వర్షాలు కురుస్తుండగా ఆదివారం నుంచి వర్షాలు పుంజుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వివిధ ప్రాంతాల్లో మూడ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నాన్పుడు వర్షాలతో పలు కాలనీల్లో రహదారులు బురదమయంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు పొలాలను తలపిస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో పొలాలు చెరువులను తలపిస్తున్నాయి.
గుంటూరులో కుండపోతగా వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరుపారింది. కాలనీల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డెల్టాలో అధికంగా వర్షాలు కురుస్తుండటంతో 10 రోజుల క్రితం వెద పద్ధతిలో సాగు చేసిన వరి పైరునీట మునిగి నష్టం వాటిల్లుతోంది. కాల్వలకు మరమ్మతులు లేక పొలాల్లోనీరు కాల్వలలోకి వెళ్లడం లేదు. కాల్వలు సరిగా లేక కాల్వల్లో పారాల్సిన నీరు పొలాల్లోకి చేరుతుండడంతో పైర్లు ఎక్కువ రోజులు నీటిలో నాని నష్టం కలుగుతుందని రైతులు వాపోతున్నారు. ప్రధానంగా కొల్లిపర, తెనాలి, చేబ్రోలు, పొన్నూరు, దుగ్గిరాల ప్రాంతాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు.
గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. తాడేపల్లి 33.8 మిల్లీ మీటర్లు, తాడికొండ 32.2, తుళ్లూరు 31.4, మంగళగిరి 30, వట్టిచెరుకూరు 22.4, క్రోసూరు 19.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైది. పల్నాడు జిల్లాలో బెల్లంకొండ 32.6, అచ్చంపేట 21, నకరికల్లు 20.6, రెంటచింతల 20.4, మాచర్ల 19.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రెండు జిల్లాల పరిధిలో అన్ని మండలాల్లో జల్లులు, ఒక మోస్తరుగా వర్షం కురింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి మరో మూడు రోజులు పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. వర్షాలు ఎక్కువ రోజులు కొనసాగితే మెట్ట ప్రాంతంలో పొలాల్లో నిలిచిన నీరు బయటకు పోయే వరకు పైర్లు వేయడానికి వీలు కాదని, అందువల్ల సేద్యం మరికొంతకాలం వేచి ఉండాల్సి వస్తుందని చెబుతున్నారు. ముసురు వాతావరణం వల్ల ఇప్పటివరకు సాగు చేసిన పత్తిపై తెగుళ్ల ప్రభావం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నట్టు కన్పిస్తున్నా పల్నాడు జిల్లాలో మాత్రం ఇప్పటివరకు ఆశాజనకమైన వర్షం కురవలేదు. జూన్‌నెలలో చాలీ చాలకుండా వర్షంకురవగా జులైలో కూడా ఇప్పటి వరకు అదేపరిస్థితి నెలకొంది. జూన్‌లో గుంటూరు జిల్లాలో 97.1 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 105 మిల్లీ మీటర్లు నమోదైంది. జులైలో 164 మిల్లీ మీటర్లు నమోదు కావాల్సి ఉండగా ఇప్పటికే 212 మిల్లీ మీటర్లు నమోదైంది. పల్నాడుజిల్లాలో జూన్‌లో 80.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 81.3 మిల్లీ మీటర్లు, జులైలో 131 మిల్లీ మీటర్లకుగాను సోమవారం వరకు 78.2 మిల్లీ మీటర్లు నమోదైంది.










