గోదావరి తగ్గుముఖం పట్టినా ముంపులోనే రహదారులు
ఆరు రోజులుగా 16 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
ప్రజాశక్తి - కుక్కునూరు
ఐదు రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద ఉధృతి తగ్గినా మండలంలోని రహదారులను మాత్రం ముంపు సమస్య వీడలేదు. భద్రాచలంలో గోదావరి నీటిమట్టం సోమవారం 38 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అయితే మండలంలోని కుక్కునూరు-దాచారం మధ్య గుండేటి వాగుపై కాజ్‌వే, ముత్యాలంపాడు-వింజరం మధ్య పాలవాగు కాజ్‌వేపై ఇంకా వరద నీరు తగ్గలేదు. దీంతో ఆరు రోజులుగా 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాగు అవతల వైపు ఉన్న గిరిజన గ్రామాలకు చెందిన ప్రజలు, కుక్కునూరు హైస్కూల్లో చదువుతున్న విద్యార్థులు, రైతులు, వ్యాపారులు మండల కేంద్రానికి రావాలంటే 15 కిలోమీటర్లు చుట్టుతిరిగి రావాల్సి వస్తోంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
లంక గ్రామాలను వీడని భయం
యలమంచిలి: ఎగువ ప్రాంతం నుండి భారీగా చేరుతున్న వరద నీటితో మండలంలో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలైన కనకాయలంక, బాడవ, పెదలంక, యలమంచిలి లంక, గంగడపాలెం, దొడ్డిపట్ల, బూరుగుపల్లి తదితర గ్రామాల్లోని ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు. భద్రాచలం వద్ద వరద నీటిమట్టం ఒకరోజు తగ్గడం, మరుసటి రోజు పెరగడం వంటి పరిణామాలతో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి వరద నీటిని దిగువకు నిరంతరాయంగా వదులుతున్నారు. దీంతో లంక గ్రామాల ప్రజల్లో అలజడి నెలకొంది. ముఖ్యంగా కనకాయలంకలోని ప్రజలు ఏ అవసరం ఉన్నా పడవ దాటి చాకలిపాలెం, మానేపల్లి, జగ్గన్నపేట, రాజోలు వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో వారి ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ప్రభుత్వం నుండి కనీసం వాటర్ ప్యాకెట్లు, చిన్న పిల్లలకు పాలు వంటివి కూడా అందించడం లేదని ఆ గ్రామంలోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి పాయ దాటడానికి కేవలం మూడు ఇంజిన్ పడవలను కేటాయించారని, అవి ఏమాత్రం ఇక్కడి ప్రజల అవసరాలకు సరిపోవడం లేదని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజల సౌకర్యార్థం పడవలను పెంచి అక్కడ ప్రజలందరికీ తాగునీరు, నిత్యావసరాలు అందించాలని సిపిఎం మండల కార్యదర్శి కానేటి బాలరాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.










