ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : జిల్లాలో అడవి ఏనుగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ కనిపిస్తోంది. ఒకప్పుడు కేవలం కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాలకే పరిమితమైన అడవి ఏనుగులు గుంపు సంఖ్య ప్రస్తుతం జిల్లాలోని మూడు గుంపులుగా నాలుగు దిక్కులకు పాకింది. కురుపాం, జియ్యమ్మవలస, వీరఘట్టం, గరుగుబిల్లి మండలాల్లో అడవి ఏనుగుల సంచారంతో ప్రజలు, రైతుల కంటిమీద కునుకులేకుండా కాలం వెల్లదీస్తున్నారు. రైతులు పండించే పంటలను సర్వనాశనం చేస్తున్నాయి. సరిగ్గా 17 ఏళ్ల క్రిందట ఒడిశా లకేరి అడవుల నుంచి గుమ్మలక్ష్మీపురం మన్య ప్రాంతానికి వచ్చిన అడవి ఏనుగులకు పుష్కలమైన నీరు, ఆహారం అందుబాటులో ఉండడంతో ఈ ప్రాంతంలో ఆవాసం ఏర్పర్చుకున్నాయి. ఒడిశాలో ఫ్యాక్టరీల పేరుతో అడవులను నాశనం చేయడంతో అడవిలో ఉండాల్సిన ఏనుగులకు రక్షణ కరువై, ఆహారం దొరక్క ఇలా జనావాసాల్లోకి వస్తున్నాయని అంటున్నారు. అడవుల్లో ఉండాల్సిన వన్యప్రాణులు ప్రజల మధ్య తిరుగుతూ వారి ప్రాణాలను, పంటలను సర్వ నాశనం చేస్తూ జనజీవనానికి ఆటంకంగా మారాయి. అసలే ఖరీఫ్ సీజన్ రైతులు వేసుకున్న వరి పంట, అరటి, మొక్కజొన్న పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. రైతులు పంట పొలాలకు వెళ్లలేక, ఇంటి వద్ద ఉండలేక బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఏ క్షణానికి ఏనుగుల గుంపు గ్రామంపై దాడి చేస్తుందోనని ప్రజలు అనుక్షణం భయపడుతున్నారు. ఏనుగుల దాడిలో ఇప్పటివరకు సుమారు 15 మంది వరకు గిరిజనులు, రైతులు మృత్యువాత పడ్డారు. ఏనుగులు ప్రజల ప్రాణాలను తీస్తున్నా అటు ప్రభుత్వం, ఇటు పాలకులు ఏనుగులను తరలించడం, ప్రజలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందాయని పలువురు గిరిజన సంఘాల నాయకులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో అడవి ఏనుగుల బెడద ఇంకా ఎంత కాలమో అంటూ ప్రజల గగ్గోలు పెడుతున్నారు. ప్రజల ప్రాణాలు తీయకముందే వాటిని తరలించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నారు.
ఏనుగులను తరలించాలి
జిల్లాలోని ప్రజల ప్రాణాలను తీస్తున్న అడవి ఏనుగుల గుంపును ఈ ప్రాంతం నుంచి ఒడిశా ప్రాంతానికి తరలించేలా ప్రభుత్వం, అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టాలి. ఏనుగుల దాడితో విలువైన ప్రాణాలు, పంట నష్టం, ఆస్తి నష్టం జరుగుతున్నా ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకోకపోవడం శోచనీయం.
- కోలక అవినాష్,
ఆదివాసీ గిరిజన సంఘం మన్యం జిల్లా కార్యదర్శి
సంగెడ్డలో ఏనుగుల గుంపు సంచారం
కురుపాం : ఏనుగులు గుంపు కురుపాం పంచాయతీ నుంచి గుమ్మడిగూడ పంచాయతీ సంగెడ్డ పరిసర ప్రాంతాల్లో పొలాల్లోకి చేరుకున్నాయి. గుమ్మడిగెడ్డకు అత్యంత సమీపంలో ఈ పొలాలు ఉన్నాయి. గుంపులో చిన్న ఏనుగు పిల్లలు ఉండడంతో గుమ్మడిగెడ్డలో పెద్ద పెద్ద గోతులు ఉండడం వల్ల జరగరాని ప్రమాదం జరిగితే చిన్న ఏనుగులు అందులో పడి మృతి చెందడం ఖాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పంట పొలాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్స్ కొన్ని చోట్ల ఉన్నాయని, గతంలో మాదిరిగా విద్యుత్ ప్రమాదం జరగకుండా అటవీశాఖ అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏనుగులకు అవసరమైన నీరు, ఆహరం ఒకే చోట ఇక్కడ లభించే అవకాశం ఎక్కువగా ఉందని ఎవరికీ హాని తలపెట్టకుండా ఉంటే ఎన్నాళ్లు ఉన్న అభ్యంతరం లేదని రైతులు పేర్కొన్నారు.










