Nov 14,2021 12:27

రిస్టు వాచీ నాదంటే నాదని ఇద్దరు పిల్లల వాదులాట పంచాయితీ పాఠం చెబుతున్న ఉపాధ్యాయుడి ముందుకు వచ్చింది.
'రాము, రవి.. ముందు ఆ వాచీ నా చేతికి ఇవ్వండి' అంటూ వాచీని తన చేతుల్లోకి తీసుకున్నాడు ఉపాధ్యాయుడు.
'నిజం నిప్పులాంటిది. దానిని అబద్ధం దాచి పెట్టలేదు. ఈ వాచీ ఎవరిదో నిజాయితీగా చెప్పండి' గద్దించి అడిగాడు ఉపాధ్యాయుడు.
'పాఠశాలకు సమయానికి రావడానికి అవసరమని మా నాన్నగారు కొన్నారు' అని చెప్పాడు రాము.
'పుట్టినరోజు కానుకగా మా మామయ్య ఇచ్చాడు' తన వాదన వినిపించాడు రవి.
'మీ ఇద్దరి వాదన ఒకేలా ఉంది. మీ ఇద్దరిలో వాచీ నాదీ అని చెప్పడానికి రుజువులేమైనా చూపించగలరా?' అడిగాడు ఉపాధ్యాయుడు.
'లోపల మూడు ముళ్లు ఉంటాయి' అని చెప్పాడు రాము.
'సార్‌ ! మీ వాచీ టైమెంత అయ్యింది?' అడిగాడు రవి.
'పది నిమిషాలు తక్కువ పది గంటలయ్యింది' ఉపాధ్యాయుడు సమాధానమిచ్చాడు.
'సార్‌! మా తగువులాట వాచీ టైము సరిగ్గా పది గంటలవుతుంది చూడండి' అన్నాడు రవి.
ఇద్దరు రుజువులు విన్నాక ఉపాధ్యాయుడు ఆ వాచీని పరిశీలనగా చూసిన తరువాత విద్యార్థులకు చూపించాడు.
ఇద్దరు చెప్పిన విషయాలు వాచీలో ప్రస్ఫుటంగా విద్యార్థులకు కనిపించాయి. చిక్కుముడిని ఉపాధ్యాయుడు ఎలా విప్పుతారా? అని మిగిలిన విద్యార్థులంతా ఆతృతతో చూస్తున్నారు. 'ఈ వాచీ రవిదే!' ప్రకటించాడు ఉపాధ్యాయుడు.
'నేను చూపించిన రుజువు సరిపోయింది కదా! రవిదని ఎలా చెప్పగలుగుతున్నారు?' పౌరుషంగా అడిగాడు రాము.
'వాచీ ఉపయోగించేవాడు సమయాన్ని నిత్యం గమనిస్తుంటాడు. అది రవి చేశాడు. సమయాన్ని గమనించకుండా మూడు ముళ్లు ఉన్నాయన్న సాధారణ విషయం రుజువుగా చెప్పావు. వాచీని నువ్వు ఉపయోగించడంలేదని అర్థమైంది. నీ మీద నీకు ఇంకా నమ్మకం ఉంటే, రుజువు కోసం నీ తల్లిదండ్రులను ఇక్కడకు పిలిపిస్తాను' స్వరం పెంచి, హెచ్చరించాడు ఉపాధ్యాయుడు.
తల్లిదండ్రులు అనేసరికి రాము భయపడ్డాడు. తన దౌర్జన్యాన్ని ఒప్పుకున్నాడు. ఉపాధ్యాయుడు రాము తప్పును సున్నితంగా తెలియజేసి, మందలించాడు. 'రవీ! నీ వాచీలో పది నిమిషాలు తేడా ఉందని ఎలా గుర్తించావు?' ఆసక్తిగా అడిగాడు ఉపాధ్యాయుడు. 'మా మామయ్య పుట్టినరోజు కానుకగా ఈ వాచీ ఇస్తూ.. 'ఇది పాఠశాలకు వెళ్లే సమయానికన్నా పది నిమిషాలు ముందుకు జరుపుతాను. పాఠశాలలో పది నిమిషాలు ముందుగా ఉండడం మంచి విద్యార్థి లక్షణం!' అని చెప్పాడు. అది జ్ఞాపకం ఉండే, నా వాచీకి రుజువు చూపించగలిగాను' వివరణ ఇచ్చాడు రవి.
విద్యార్థులు రవి క్రమశిక్షణకు జేజేలు పలికారు.

బి. వి. పట్నాయక్‌
94413 49275