Apr 15,2023 00:38
విఆర్‌ఎలకు ఎమ్మెల్యే గొట్టిపాటి సంఘీభావం

ప్రజాశక్తి-అద్దంకి: జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబట్టుకుని తమ న్యాయమైన సమస్యను పరిష్కరించాలని కోరుతూ అద్దంకి పట్టణంలోని బంగ్లారోడ్డులో గల డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద గ్రామ సహాయకు (విఆర్‌ఏ)లు నిరసన చేశారు. వీరి ఆందోళనకు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో విఆర్‌ఏలకు ఇచ్చిన హామీ మేరకు 21 వేలు రూపాయల జీతం ఇవ్వాలని కోరారు. మాటతప్పం మడమతిప్పం అంటూ అన్ని వర్గాల ప్రజలకు అమలుకాని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకుని అధికారాన్ని చేపట్టి నేడు అందరినీ మోసం చేసిన ఘనత జగన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ గడిచిన తెలుగుదేశంపార్టీ హయాం లో విఆర్‌ఏల జీతం 6,500 నుంచి 10,500 లకు అనగా 4వేల రూపాయలు పెంచి నట్లు తెలిపారు. ప్రస్తుతం పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని గ్రామ సహాయకులకు కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇచ్చిన డీఏ (భోజన అలవెన్సు) రికవరీ చేయడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. రికవరీ ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించు కోవాలని కోరారు. ప్రభుత్వ పథకాల అమలు కోసం అనుక్షణం కష్టపడే విఆర్‌ఏలకు తెలుగు దేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నా కూడా తెలుగు దేశం ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్‌ ఇచ్చిందని అన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రివర్స్‌ పీఆర్సీ అమలు చేసి ఉద్యోగుల జీతాలు తగ్గిం చిందని దుయ్యబట్టారు. రివర్స్‌ పీఆర్సీ ద్వారా దాదాపుగా కోటిన్నర విఆర్‌ఏల జీతాలు వెనక్కి తీసుకోవడం ప్రభుత్వం దిగజారుడు రాజకీయా లకు నిదర్శనమని పేర్కొన్నారు. విఆర్‌ఏలు చేపట్టిన నిరసన దీక్షకు తెలుగుదేశం పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తు న్నాం. అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయ పరమై న డిమాండ్లను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. విఆర్‌ఏల న్యాయపరమైన డిమాండ్లను, సమస్య లను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు.