
విహారయాత్రలో విషాదం
అవుకు రిజర్వాయర్‌లో బోటు బోల్తా ముగ్గురు మతి
కానిస్టేబుల్ కుటుంబంలో తీవ్ర విషాదం
ప్రజాశక్తి-అవుకు
విహారయాత్ర విషాదం మిగిల్చింది. టూరిజం బోటు నిర్వహణలో నిర్లక్ష్యం మూడు నిండు ప్రాణాలను బలితీసుకుంది. వేసవి సెలవుల్లో సంతోషంగా గడుపుదామని కుటుంబం, బంధువులతో గడుపుదామని వెళ్లిన వారికి అవుకు రిజర్వాయర్‌లోని టూరిజం బోటు యమపాశమైంది. బాధిత కుటుంబసభ్యుల వివరాల ప్రకారం..... కోవెలకుంట్ల పోలీస్ కానిస్టేబుల్ దూదేకుల రసూల్ కుటుంబ సభ్యులతో కలిసి అవుకు రిజర్వాయర్‌లో జలవిహారం చేసేందుకు వచ్చారు. అవుకుపోలీస్ స్టేషన్‌లో గతంలో రసూల్ కానిస్టేబుల్‌గా పనిచేశారు. వేసవి సెలవులు కావడంతో బంధువులతో కలిసి వచ్చారు. అవుకు సాయిబాబా ఆలయంలో తొలుత పూజలు చేసి అక్కడి నుండి రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. రిజర్వాయర్‌లో జలవిహారం చేసేందుకు బోట్ ఎక్కారు. రిజర్వాయర్‌లో సగం దూరానికి వెళ్లేసరికి బోటు లోపలికి నీళ్లు రావడం గమనించారు. బోటు డ్రైవర్‌కు తెలిపినా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. బోటు లోనికి నీరు ఎక్కువగా రావడంతో డ్రైవరు నీళ్లలోకి దూకాడు. అందులో ఉన్న వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే బోటు బోల్తా పడటంతో అందరూ నీళ్లలో పడిపోయారు. వారిని రక్షించేందుకు రసూల్ కొందరిని బోల్తా పడిన బోటు పైకి ఎక్కించాడు. అక్కడుండి గట్టిగా కేకలు వేస్తున్నా బోటింగ్ సిబ్బంది ఎవరు కూడా రాలేదు. బోటింగ్ చేసే సమయంలో వారికి లైఫ్ జాకెట్లను కూడా ఇవ్వలేదు. రిజర్వాయర్ వద్ద ఉన్న కొంతమంది స్థానికులు గమనించి నీళ్లలో పడిపోయిన వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. మొత్తం 14 మంది కుటుంబ సభ్యుల్లోని 13 మందిని రక్షించి బయటికి తీసుకు రాగలిగారు. కానిస్టేబుల్ కుమార్తె సాజిత (20), ఆయన అన్న కుమార్తె ఆసియాబి (23)కళ్ళ ముందరే నీటిలో మునిగిపోయారు. వారిని రక్షించేందుకు కొందరు ప్రయత్నించగా అన్న కూతురు ఆసియాబిని బయటికి లాగారు. అప్పటికే ఆమె మృతి చెందిందని 108 సిబ్బంది తెలిపారు. సాజిత ఎంత వెతికినా కనిపించకపోవడంతో అధికారులు గజఈతగాళ్లకు సమాచారం అందించారు. నీటిలోంచి బయటికి తీసిన వారిలో చిన్నారులు చెస్విక్, హనీ, సోదరుని భార్య నూర్జహాన్ అపస్మారక స్థితిలో ఉండటం గమనించి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో కోలుకోలేక నూర్జహాన్ (33) మతి చెందింది.
హెడ్ కానిస్టేబుల్ రసూల్ అన్న దస్తగిరి తమ్ముడు బషీర్‌బాష కుటుంబంలోని ఒక్కో కుటుంబానికి చెందిన ఒకరు మృతి చెందారు. వారికుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
సాజిత అనే అమ్మాయి ఈ మధ్యనే నీట్ పరీక్ష రాసింది. ఈ పరీక్షలో 510 మార్కులు వచ్చే అవకాశం ఉందని తల్లి డి.మహేశ్వరి బోరున విలపించారు. రసూల్ అన్న దస్తగిరి కూతురు ఆసియాబి అగ్రికల్చర్ బిఎస్‌సి చదువుతోందని ఇద్దరు కూడా చదువుల్లో ఉన్నతంగా రాణించి కుటుంబానికి తోడు నీడగా ఉంటారన్న తమ ఆశలు అడియాశలయ్యాయని కుటుంబ సభ్యులు విలపించారు. బషీర్‌బాష నూర్జహాన్ దంపతులు ఇద్దరూ ప్రభుత్వ టీచర్లు కావటం నూర్జహాన్ నీటిలో మునిగిపోయి ఇద్దరు పిల్లలు చనిపోయిన సంఘటనను తలుచుకొని ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ప్రభుత్వాసుపత్రిలో కోలుకోలేక మరణించడంతో ఆ మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనకు రిజర్వాయర్ టూరిజం శాఖ నిర్లక్ష్య వైఖరి స్పస్టంగా కనిపిస్తోంది. ఎక్కడ కూడా టూరిజం వాళ్లు నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా బోట్లను నడిపి మా కుటుంబంలో ముగ్గురుని బలి తీసుకున్నారని కుటుంబ సభ్యులు డి.మహేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. అవుకు ఎస్‌ఐ జగదీశ్వర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి గల్లంతైన సాజిత కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో సాయంత్రం ఎపిఎన్‌డిఆర్‌ఎఫ్ బందాలు రిజర్వాయర్ వద్దకు చేరుకున్నాయి. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించి మా కుటుంబానికి న్యాయం చేయాలని రసూల్ కుటుంబ సభ్యులు కోరారు.
అవుకు ఎంపిపి చల్లా రాజశేఖర్ రెడ్డి, వైసిపి యువ నాయకులు చల్లా విగేశ్వర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచి దుగ్గిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, వైసిపి నాయకులు జయ చంద్ర రెడ్డి, పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి లు రిజర్వాయర్ వద్ద చేరుకొని రిజర్వాయర్‌లో చిక్కుకున్న వారిని బయటికి తీయించారు.
ఘటనాస్థలాన్ని సందర్శించిన ఎస్‌పి
అవుకు రిజర్వాయర్ లో పడవ బోల్తా పడి ముగ్గురు మతి చెందిన విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్‌పి జి.కృష్ణకాంత్ , డోన్ ఆర్‌డిఒ వెంకటరెడ్డి, డోన్ డిఎస్‌పి శ్రీనివాస్‌రెడ్డి, కోవెలకుంట్ల సిఐ ఆదినారాయణరెడ్డి, బనగానపల్లె ఇన్‌ఛార్జి సిఐ ప్రియతమ రెడ్డి ఘటనకు సంబంధించి వివరాలను తెలుసుకున్నారు. ఘటన జరిగిన తీరుపై పూర్తి నివేదిక పంపాలని ఎస్‌పి డిఎస్‌పి, ఇతర అధికారులను ఆదేశించారు.
మృతుల కుటుంబాలకు కాటసాని ఓబుల్ రెడ్డి పరామర్శ
బనగానపల్లె : అవుకు రిజర్వాయర్ తిమ్మరాజు జలాశయంలో బోటు బోల్తా పడి మృతి చెందిన మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తనయుడు వైసిపి యువ నాయకులు కాటసాని ఓబుల్ రెడ్డి పరామర్శించారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్ స్పెషల్ బ్రాంచి కానిస్టేబుల్ రసూల్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి పోస్ట్‌మార్టం రూములో దూదేకుల ఆసియా భాను, దూదేకుల నూర్జహాన్ మృతదేహాలకు ఆయన నివాళులర్పించారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ప్రమాదానికి గురైన బోటు టూరిజం శాఖది కాదు
- పర్యాటక అధికారి సత్యనారాయణ
నంద్యాల కలెక్టరేట్ : అవుకు జలాశయంలో ప్రమాదానికి గురైన బోటు ఎపి టూరిజం శాఖధి కాదని పర్యాటక అధికారి సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అవుకు జలాశయంలో ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడి 12 మంది గల్లంతయ్యారని, సంబంధిత బోటు ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నారని, టూరిజం శాఖ వారిది కాదన్నారు. జలాశయంలో బోటు నడిపేందుకు ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చామన్నారు. ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్న బోటు రెన్యువల్సుకు సంబంధించి ఎలాంటి అనుమతులు రాలేదని ఆయన స్పష్టం చేశారు. రెన్యువల్ కాకపోయినా బోటు నడిపి ప్రమాదానికి గురైందన్నారు. కాకినాడకు చెందిన ఎపి మెరైన్ బోర్డు అధికారులు బోటుని తనిఖీ చేశారని, అనుమతిస్తూ లైసెన్స్, రెన్యువల్స్ మంజూరు చేయాల్సి ఉందన్నారు. ప్రతి సంవత్సరం బోటు రెన్యువల్‌కు సంబంధించి అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుందన్నారు. అవుకు జలాశయంలో ప్రమాదానికి గురైన బోటు ఎపి టూరిజం కాదని పేర్కొన్నారు.










