Jan 13,2023 00:26

సుభాష్‌ చంద్ర మృతదేహం

జడేరు వాగులో జారిపడి విద్యార్థి మృతి
ప్రజాశక్తి- అడ్డతీగల

విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని వేటమామిడి పంచాయతీ పైడిపుట్ట గ్రామం వద్ద ఉన్న జడేరు వాగులో గురువారం మధ్యాహ్నం ప్రమాదవశాస్తు కాలుజారి పడి పదవ తరగతి విద్యార్థి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం... తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన డోకు బుర్ర సుభాష్‌ చంద్ర (14) అదే గ్రామంలో చెరుకూరి విద్యాసంస్థల్లో పదవ తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం చెరుకూరి విద్య సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ సిబ్బంది 60 మంది, తమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 20 మంది విద్యార్థులతో కలిపి నాలుగు బస్సుల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం వేట మామిడి పంచాయతీ పైడిపుట్ట గ్రామం వద్ద ఉన్న జడేరు వాగు ప్రాంతానికి విహారయాత్రకు వచ్చారు. ఉపాధ్యాయ సిబ్బంది అందరికీ భోజనాలు సమకూర్చే పనిలో నిమగమై ఉండగా, ఈలోగా విద్యార్థులు స్నానాలు చేసేందుకు వాగు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో సుభాష్‌ చంద్ర ప్రమాదవశాస్తు కాలుజారి వాగులో కొట్టుకుపోయాడు. తోటి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయ సిబ్బంది సుభాష్‌ చంద్రను కాపాడే ప్రయత్నం చేసి సుభాష్‌ చంద్రను బయటకు తీశారు. అప్పటికే అపస్మారకస్థితిలో ఉన్న సుభాష్‌ చంద్రను హుటాహుటిన అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు సుభాష్‌చంద్ర తండ్రి వీరయ్య ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ సంఘటనపై అడ్డతీగల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.