ప్రజాశక్తి-అచ్యుతాపురం
విశాఖపట్నం స్పెషల్ ఎకనమిక్ జోన్ (విఎస్‌ఇజెడ్) జాయింట్ డెవలప్‌మెంట్ కమిషనర్ వసంత కిరణ్‌బాబు బదిలీపై తన మాతృ సంస్థకు వెళ్తున్న సందర్భంగా ఆయనకు పారిశ్రామిక వేత్తలు, ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు. విశాఖలోని హోటల్ పామ్ బీచ్‌లో సోమవారం రాత్రి జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో వసంత కిరణ్‌బాబును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ ఇండియా భాగస్వామి దొరస్వామి జెడిసి కిరణ్‌బాబు దంపతులకు శాలువ కప్పి, పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి చిత్ర పటాన్ని బహూకరించి సన్మానించారు. 22వేల మంది బ్రాండిక్స్ ఉద్యోగుల తరుపున అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దొరస్వామి మాట్లాడుతూ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ సమయంలోనైనా, ఫోన్ కాల్‌తో పరిశ్రమలకు సేవలు అందించడం ద్వారా ఆత్మీయ ఉద్యోగిగా అందరి మన్ననలు పొందారని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మాతృ సంస్థకు వెళ్తున్న కిరణ్ బాబు భవిష్యత్ లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ ఎస్‌జెఎన్‌హెచ్‌కె. వరప్రసాదవర్మ, జాయింట్ డిజిఎఫ్‌టి బిఎన్.రమేష్, జాయింట్ డెవలప్‌మెంట్ కమిషనర్ ఆర్‌ఎ.ప్రవీణ్ కుమార్, ఎపిఇపిడిసిఎల్ డైరెక్టర్ చంద్రం, పారిశ్రామిక వేత్తలు, విఎస్‌ఇజెడ్ ఉద్యోగులు పాల్గొన్నారు.










