ప్రజాశక్తి - ఏలూరు
వన సంరక్షణ సమితులకు కొత్త ప్లాంటేషన్లకు అనుమతులు ఇవ్వాలని, కటింగ్‌కు వచ్చిన ప్లాంటేషన్లకు కటింగ్ ఆర్డర్ ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ డిమాండ్ చేశారు. వన సంరక్షణ సమితుల సమస్యలు పరిష్కరించాలి, కొత్త ప్లాంటేషన్లకు అవకాశం కల్పించాలని, కటింగ్‌కు వచ్చిన ప్లాంటేషన్లకు ఆర్డర్లు ఇవ్వాలని కోరుతూ జిల్లా అటవీశాఖ కార్యాలయం వద్ద ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో వన సంరక్షణ సమితులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో తునికాకు వేతన బకాయిలు అందక వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో నిర్వాసితుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. విఎస్‌ఎస్‌లకు గత పది సంవత్సరాల నుండి కటింగ్ ఆర్డర్లు ఇవ్వకపోవడంతో అవి పెద్ద మానవులుగా మారిపోయాయని తెలిపారు. గతంలో మండలస్థాయి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. ఉంగుటూరు, లింగపాలెం, టి.నర్సాపురం, చింతలపూడి మండలాల్లో విఎస్‌ఎస్‌లు కటింగ్ ఆర్డర్లు ఇవ్వాల్సి ఉండగా నేటికీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాంటేషన్ల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి విఎస్‌ఎస్‌ల సమస్యలు పరిష్కరించేటట్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విఎస్‌ఎస్‌లో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న మండల అటవీశాఖ అధికారులపై జిల్లా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. వ్యవసాయ కూలీలు, పేదలు, దళితులను ఇబ్బందులు పెడుతున్న కిందిస్థాయి అధికారులపై చర్యలు కరువయ్యాయన్నారు. ఇప్పటికైనా ఉన్నతస్థాయి అధికారులు వీటిపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటవీ శాఖాధికారుల వ్యవహార శైలి మారాలని, పేదలకు ఉపయోగపడేలా ఉండాలని కోరారు. మండలస్థాయిలో రాజకీయ నాయకులతో కలిసి అవినీతికి పాల్పడుతున్నారని తెలిపారు. ఈ అవినీతి, అక్రమాలను అడ్డుకట్ట వేయాలని, ఉన్నతస్థాయి అధికారులు పక్షపాతం లేకుండా దర్యాప్తు చేయాలని కోరారు. ధర్నాకు సంఘం జిల్లా నాయకులు తుమ్మల సత్యనారాయణ, డి.దాసు నాయకత్వం వహించగా విఎస్‌ఎస్‌ల సభ్యులు చిన్న అంజయ్య, బాబూరావు, జయరాజు, సంతోషం, సుశీల పాల్గొన్నారు.










