ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : తరతరాల నుంచి సాగు చేస్తున్న జెకెపాడు విఎస్‌ఎస్ ఉమ్మడి భూమిపై స్థానిక గిరిజనులకు హక్కు కల్పించాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోలక అవినాష్ మాట్లాడుతూ ఎల్విన్‌పేట పంచాయతీ జెకె పాడు గ్రామ సమీపంలో ఉన్న వన సంరక్షణ సమితి భూమిని అదే గ్రామానికి చెందిన గిరిజనులు గత కొన్నేళ్ల నుంచి సాగు చేస్తూ భూమిపై ఉమ్మడి హక్కు కలిగి ఉన్నారని తెలిపారు. ఇందుకు సంబంధించి అటవీశాఖ అధికారులు గిరిజనులకు పట్టాలు కూడా మంజూరు చేశారన్నారు. ఈ తరుణంలోనే విఎస్‌ఎస్ భూమిని కాపాడుకుంటూ వస్తున్నారని తెలిపారు. అయితే ఇటీవల కాలంలో కొందరు నాయకులు ఇళ్ల స్థలాల పేరుతో బయట ప్రాంతానికి చెందిన గిరిజనులను తీసుకొచ్చి విఎస్‌ఎస్ భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగా తోలుఖర్జ, మంగళాపురం గ్రామాలకు చెందిన గిరిజనులకు, జెకెపాడు గిరిజనులకు మధ్య తగద పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఇతర గ్రామాల గిరిజనులను తీసుకొచ్చి భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్న నాయకులుపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని, ఉమ్మడి విఎస్‌ఎస్ భూమికి రక్షణ కల్పించాలని రెవిన్యూ అధికారులను కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కోశాధికారి మండంగి రమణ, జెకెపాడు గిరిజనులు ఉన్నారు.










