Jul 13,2023 21:58

ధర్నా చేస్తున్న గిరిజనులు

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం :  ఎల్విన్‌పేట పంచాయతీ పరిధిలో జాతాపు కోటపాడు విఎస్‌ఎస్‌ భూమికి రక్షణ కల్పించి తమకు అప్పగించాలని గురువారం గిరిజన సంఘం ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట గిరిజనులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ ఇతర గ్రామాల నుంచి విఎస్‌ఎస్‌ భూమిని ఆక్రమిస్తున్నారని తెలిపారు. ఆక్రమణకు గురవుతున్న భూమి జెకెపాడులో ఉన్న విఎస్‌ఎస్‌ ఉమ్మడి భూమి అని సర్వహక్కులు మాకు ఉన్నాయని తెలిపారు. ఇళ్ల స్థలాల పేరుతో ఇతర గ్రామాల నుంచి వచ్చి ఆక్రమిస్తున్న నేపథ్యంలో తగాదాలు జరుగుతున్నాయని చెప్పారు. విఎస్‌ఎస్‌ భూమి తమ పంచాయతీ పరిధిలో గిరిజనులకు అనేక అవసరాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి ఏటా అటవీశాఖ నుండి జంగిల్‌ క్లియరెన్స్‌ ద్వారా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. దీని ద్వారా తమకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ విషయమై అటవీ శాఖ అధికారులకు తెలిపామని చెప్పారు. భూమికి హక్కుదారులు జెకెపాడు గ్రామస్తులేనని చెప్పారన్నారు. కార్యక్రమంలో ఎపి గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మండంగి రమణ, రాష్ట్ర నాయకులు కోలక అవినాష్‌, మండల నాయకులు పువ్వల తిరుపతిరావు, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.