- పకౌన్సిల్‌లో అధికార వైసిపి ఏకపక్ష ఆమోదం పవ్యతిరేకించిన సిపిఎం, టిడిపి పడిస్నీల్యాండ్ స్థలం అంశం వాయిదా
ప్రజాశక్తి - విజయవాడ : విజయవాడ నగరపాలక సంస్థ విలువైన ఆస్తులను పిపిపి పద్ధతిలో ప్రైవేటు వారికి కట్టబెట్టే నిర్ణయాలను విపక్షాలకు ఎటువంటి చర్చకు అవకాశం ఇవ్వకుండానే అధికార వైసిపి ఆమోదించేసుకుంది. ట్రస్టీల పేరుతో నడుస్తున్న స్కూళ్లకు విఎంసి స్థలాలను కారు చౌకగా ఇచ్చేందుకు నిర్ణయించింది. మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన విజయవాడ నగర పాలక సంస్థ కౌన్సిల్ సాధారణ సర్వసభ్య సమావేశం సోమవారం జరిగింది. సమావేశం ముగుస్తున్న సమయంలో 88 (కె) కింద అప్పటికప్పుడు ప్రత్యేక అంశం కింద వీటిని తీసుకొచ్చి ఏకపక్షంగా ఆమోదించుకుంది. సింగ్‌నగర్‌లోని 10 ఎకరాల డిస్నీల్యాండ్‌లో పిపిపి పద్ధతిలో కబేళా ఏర్పాటుకు పెట్టిన ప్రతిపాదనను స్వయంగా అధికారపక్ష ఎంఎల్‌ఎ మల్లాది విష్ణు వ్యతిరేకించారు. డిస్నీల్యాండ్ స్థలాన్ని పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని సిపిఎం ఫ్లోర్‌లీడర్ బోయి సత్యబాబు డిమాండ్ చేశారు. టిడిపి ఫ్లోర్‌లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి కూడా డిస్నీల్యాండ్‌ను కబేళాకు ఇచ్చే అంశాన్ని ఉపసంహరిం చుకోవాలని డిమాండ్ చేశారు. 18/89 అంశంలో పేర్కొన్న విద్యాధరపురం కబేళాను రూ.31 కోట్లతో పిపిపి పద్ధతిలో ఆధునీకరణ పేరుతో 33 ఏళ్లపాటు ప్రైవేటు వారికి కట్టబెట్టడాన్ని సిపిఎం, టిడిపి ఫ్లోర్‌లీడర్లు పూర్తిగా వ్యతిరేకించారు. విఎంసి ఆధ్వర్యంలోనే మేయర్‌కు సిపిఎం ఫ్లోర్‌లీడర్ సత్యబాబు డీసెంట్‌నోట్ అందజేశారు. అమృత్ స్కీమ్ -2లో భాగంగా ఆటోనగర్ సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్‌టిపి)ను కూడా పిపిపి పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు ఇవ్వొద్దని సిపిఎం, టిడిపి ఫ్లోర్‌లీడర్లు డిమాండ్ చేశారు. అలా చేస్తే విఎంసికి ఎటువంటి అధికారాలూ ఉండకపోగా, ప్రైవేటు వారు వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని కెఎల్‌రావు పార్కునూ పిపిపి పద్ధతిలోనే ప్రైవేటు వారికి ఇవ్వొద్దని కోరారు. ఆటోనగర్ సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ఆధునీకరించి విఎంసినే నడపాలని, అలాగే కెఎల్‌రావు పార్కునూ ఇప్పటి మాదిరిగానే విఎంసి నిర్వహించాలని మేయర్ భాగ్యలక్ష్మికి సిపిఎం ఫ్లోర్‌లీడర్ బోయి సత్యబాబు డీసెంట్ నోట్‌ను అందజేశారు. విపక్షాల నిరసనల నడుమ విద్యాధరపురం కబేళా, ఆటోనగర్ ఎస్‌టిపి, కెఎల్‌రావు పార్కు అంశాలను అధికార వైసిపి ఏకపక్షంగా ఆమోదించేసుకుంది. విపక్షాలే కాకుండా అధికార వైసిపి కార్పొరేటర్ జానారెడ్డి, చివరకు సెంట్రల్ ఎంఎల్‌ఎ వ్యతిరేకించడంతో డిస్నీల్యాండ్‌లో కబేళా ఏర్పాటు అంశాన్ని వాయిదా వేస్తూ కౌన్సిల్ నిర్ణయించింది. ఆటోనగర్ ఎస్‌టిపిని పిపిపి పద్ధతిలో పెట్టారా అంటూ మేయర్ సందేహం వ్యక్తం చేయడం గమనార్హం. శ్రీ రామకృష్ణ సమితి ఆధ్వర్యాన అజిత్‌సింగ్ నగర్లోని వివేకానంద సెంటినరీ ఉన్నత పాఠశాల 1.20 ఎకరాల్లో, అలాగే పాయకాపురంలోని శారదా విద్యాలయం విద్యాలయం 1.20 ఎకరాల్లో నడుస్తున్నాయని, విఎంసికి చెందిన ఈ స్థలాలను లీజుకి తీసుకున్నారని, ఇప్పుడు ఆ రెండు విద్యాసంస్థలకు ప్రత్యామ్నాయంగా మార్కెట్ విలువ ప్రకారం కాకుండా ప్రభుత్వ విలువ ప్రకారం అతి కారు చౌకగా వేరేచోట విఎంసి స్థలాలను చదరపు గజం రూ.15 వేల చొప్పున ఇచ్చేవిధంగా కౌన్సిల్ ఆమోదించడాన్ని సిపిఎం ఫ్లోర్‌లీడర్ ప్రశ్నించారు. తాము పూర్తిగా ఈ అంశాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. దీని వెనుక అధికారపార్టీ పెద్దల హస్తం ఉందని ఆయన విమర్శించారు. అత్యవసర అంశాల పేరుతో 88 (కె) కింద 218 నుంచి 223 వరకు తీసుకొచ్చిన అంశాలపై ఎటువంటి చర్చ జరగకుండానే అధికారపక్షం ఆమోదిం చుకుంది. కనీసం తీర్మానాల కాపీని కూడా కార్పొరేటర్లకు గానీ, మీడియాకుగానీ ఇవ్వకపోవడం గమనార్హం.
(విఎంసి కౌన్సిల్ వార్తలు
మరికొన్ని లోపలి పేజీల్లో)










