ఏడాదంతా రైతు
మంచుమడుల్లో నిరసన ట్రాక్టర్లతో
పోరాట దుక్కుదున్నాడు
నిరసన విత్తుల్ని విత్తాడు
ఇప్పుడిప్పుడే పిడికిళ్ళు గింజ కట్టాయి
పంట కోతకొస్తున్నట్టే వుంది
2021 నవంబర్ 19న
హలాలు గెలుపు పాటలయ్యాయి
ఎర్రకోట మీద ఎగిరే
జాతీయజెండా మధ్యలో నవ్వే అశోకచక్రం
నాగలికీ చోటిచ్చి గర్వపడింది !
కొత్త వేరియెంట్ చొక్కావేసుకుని
చావు మీద పడ్డాక
నిర్లక్ష్యం ఖరీదు లక్షల ప్రాణాలవుతుంటే
శ్వాసాడని దేశం
చరిత్రలో మానని గాయమైంది !
రాబందు ఖాళీ చేసిన పొరుగు నేల మీద
మళ్ళీ తుపాకుల రాజ్యం వెలిసాక
విమానాశ్రయం పిట్టగోడ మీంచి
పసిప్రాణమొకటి
ప్రపంచాన్ని పిలుస్తోంది, జాలిగొంతుతో !
ఎప్పట్లాగే లేత కనుపాపల్ని
కనురెప్పలే కాటేసాయి
కోరలు చాసిన కామానికి కలలు నేలరాలాయి
అభద్రతా భారతం
ఆడబిడ్డను కనడానికే వణుకుతోంది !
దేశాన్ని కారు చవకగా
అమ్మకానికి పెట్టింది రాజ్యం
ఉపసంహరణ చేతులూపి..
గద్దల్లారా రండి !
గాలీ నేలా ఉక్కుదీపాలూ రైళ్ళూ బ్యాంకులూ
ఎవరికేం కావాలో ఎత్తుకుపోండని పిలుస్తోంది
డైరీలో ఆఖరి పేజీ అడుగుతోంది
ఎలా గడిచిందీ సంవత్సరమంటూ
ఆలోచించేందుకేముంది ?
ఈ యేడూ విధ్వంసానికి కొనసాగింపే !
- సాంబమూర్తి లండ
9642732008