May 31,2022 06:55

''కులం పునాదుల మీద ఒక నీతిని గానీ, ఒక జాతిని గానీ నిర్మించలేరు'' అని డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌ 86 ఏళ్ళ క్రితం కుండ బద్దలు కొట్టినట్లు ప్రకటించారు. అయినా మన సమాజం కులం జబ్బు నుంచి బయటపడలేదు. ''ప్రజాస్వామ్యం అనేది కేవలం ఒక రాజకీయ మంత్రమో, తంత్రమో కాదు, ప్రజాస్వామ్యమంటే ఒక జీవనతత్వం'' అని నిర్వచించారాయన. ఆ మానవీయ సిద్ధాంతం మన చెవులకెక్కటం లేదు. దానికి ఇంకెంత కాలం పడుతుందో !

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లాను డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌ జిల్లాగా మార్చిన తర్వాత, గత కొద్ది రోజులుగా అక్కడ జరుగుతున్న విధ్వంసం భారత జాతిని దిగ్భ్రమలో ముంచేసింది. ప్రజాస్వామ్యం మీద, లౌకికవాదం మీద, మానవ సంస్కారం మీద విశ్వాసం ఉన్నవాళ్లు ఈ విధ్వంసం పట్ల అసహ్యంతో ఉన్నారు. డా||బి.ఆర్‌.అంబేద్కర్‌ను భారత రాజ్యాంగ నిర్మాతగా, భారతరత్నగా గౌరవించింది భారతదేశం. ఏ జాతీయ నాయకుని శత జయంతిని జరపని పద్ధతిలో, భారతదేశం అంబేద్కర్‌ శత జయంతిని వరుసగా మూడేళ్ళ పాటు జరిపింది. అంబేద్కర్‌ ప్రపంచం గుర్తించిన భారతీయ మేధావి. భారత రాజ్యాంగ నిర్మాణంలో ఆయనది అత్యంత కీలకమైన పాత్ర. భారత దేశాన్ని ప్రజాస్వామికంగా, మానవీయంగా, నాగరికంగా మార్చడానికి జీవితమంతా కృషి చేశారు. గొప్ప విద్యావంతుడు, పరిశోధకుడు. ఇప్పటికే దేశంలో చాలా పరిపాలనా భవనాలకు ఆయన పేరు పెట్టుకున్నారు. భారతదేశంలో ఆయన పేరుతో మరట్వాడ విశ్వవిద్యాలయం ఉంది. అటువంటి గొప్ప వ్యక్తి పేరు మీద ఒక జిల్లా ఆవిర్భవించడం తెలుగు జాతికే గర్వకారణంగా భావించాల్సింది పోయి, విధ్వంసానికి పూనుకోవడం దారుణం. ఆ విధ్వంసానికి బాధ్యులెవరు? వాళ్ళకు శిక్ష ఏమిటి? వాళ్ళను ప్రేరేపించిన వాళ్ళు ఎవరు? అన్నవి ప్రభుత్వం చూస్తుంది. నిస్సందేహంగా ఆ విధ్వంసం అనాగరికం. అప్రజాస్వామికం. సందుగొందులకు స్థానిక నాయకుల పేర్లు ప్రకటించుకుంటున్న సమయంలో ఒక జిల్లాకు జాతీయ నాయకుల పేరు పెడితే ఆహ్వానించాల్సింది పోయి, విధ్వంసానికి పూనుకోవడం ఏ మాత్రం సహించలేని తప్పు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్బై Ûఅయిదేళ్ళు అవుతున్న సమయంలో, భారతదేశం దానిని అమృతోత్సవంగా పండుగ చేసుకున్న సమయంలో... కోనసీమ విధ్వంసం పాలల్లో ఉప్పుగల్లు వేయడం వంటిదే. ''కులం పునాదుల మీద ఒక నీతిని గానీ, ఒక జాతిని గానీ నిర్మించలేరు'' అని డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌ 86 ఏళ్ళ క్రితం కుండ బద్దలు కొట్టినట్లు ప్రకటించారు. అయినా మన సమాజం కులం జబ్బు నుంచి బయటపడలేదు. ''ప్రజాస్వామ్యం అనేది కేవలం ఒక రాజకీయ మంత్రమో, తంత్రమో కాదు, ప్రజాస్వామ్యమంటే ఒక జీవనతత్వం'' అని నిర్వచించారాయన. ఆ మానవీయ సిద్ధాంతం మన చెవులకెక్కటం లేదు. దానికి ఇంకెంతకాలం పడుతుందో! కవీ, ప్రవక్తా కాలం కన్నా ముందుంటారు అన్నారు గురజాడ. అలా కాలం కన్నా ముందు ఉండిన భారతీయ ప్రవక్తలు గౌతమ బుద్ధుడు, వేమన, వీరబ్రహ్మం, మహాత్మా ఫూలే, నారాయణ గురు, కబీరు వంటి వారు. ఆ తానులో పోగు డా|| బి.ఆర్‌ అంబేద్కర్‌. అటువంటి దార్శనికునికి జరగవలసిన అవమానమేనా ఆ విధ్వంసం? ఒక్కసారి ఆలోచించాలి ఆ విధ్వంసకారులు, వాళ్ళ నాయకులు.
    అసలే మన ప్రజాస్వామ్యం అంతంత మాత్రంగా మనుగడ సాగిస్తున్నది. ఇలాంటి సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆశ్రయించవలసిన జాతీయ నాయకుడు డా|| బి.ఆర్‌ అంబేద్కర్‌. అలాంటిది ఆయననే అవమానించడానికి పూనుకోవడం చాలా దారుణం. ''బోధించు, సమీకరించు, పోరాడు'' అనే మూడు కర్తవ్యాలను బోధించిన నాయకుని మీదనే ఇలా తిరోగమన చర్యలకు పూనుకోవడం తలకిందులు వ్యవహారం. అనేక మంది నాయకుల పేర్లతో జిల్లాలు ఏర్పాటు చేయడం పట్ల లేని వ్యతిరేకత అణగారిన కులానికి చెందిన అంబేద్కర్‌ పేరును ఒక జిల్లాకు పెడితే వ్యతిరేకత ఎందుకు? అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు వారి దగ్గర సమాధానం ఉందా ?
     ఈ సందర్భంగా పబ్లిక్‌ నుంచి మరో ప్రశ్న ఎదురవుతున్నది. విదేశీయుడు, వలస పాలకుడు అయిన సర్‌ ఆర్థర్‌ కాటిన్‌ ఆనకట్టలు కట్టించి కోస్తా ప్రాంతం సస్యశ్యామలం కావడానికి దోహదం చేశాడని, ఆయన పట్ల గౌరవంతో తర్పణాలు వదులుతున్నారు. భౌతిక సంపద పెరగడానికి సహకరించాడని అతనికి అంతటి గౌరవం ఇస్తున్నారు. అలాంటిది, భారతీయుడు అయిన అంబేద్కర్‌ దేశం మొత్తానికి సామాజిక న్యాయం అనే భౌతిక సూత్రం అందించారు. దాని కోసం ఉద్యమాలు నడిపారు. భారతదేశ బౌద్ధిక మార్పునకు శ్రమించారు కదా! స్థానికంగా ఏవైనా సామాజిక వైరుధ్యాలు ఉంటే వాటిని స్థానికంగా పరిష్కరించుకోవాలి తప్ప ఒక జాతీయ నాయకుని అవమానించడం నాగరిక సమాజంలో తలవంపులు తేవడమే అవుతుంది.
     ''అందారు పుట్టిరి హిందమ్మ తల్లీకి... ఎట్టాగూ యెక్కూవ యెవ్వారు మా కంటే?'' అని ''మాలవాండ్ర పాట'' 1909 లోనే ప్రశ్నించింది. 'మంచి చెడ్డలు మనుజులందున/ యెంచి చూడగా రెండె కులములు/ మంచియన్నది మాలయైతే/ మాల నేయగుదున్‌' అని చెప్పిన గురజాడ అప్పారావు ''వర్ణ ధర్మ మధర్మ ధర్మంబే'' అని తీర్పునిచ్చారు. గుర్రం జాషువ 1934 లోనే ''ధర్మమునకును గలుగునే కుల వివక్షతయు చిన్న పెద్ద భేదము'' అని ప్రశ్నించారు. కోనసీమకు అన్ని వైపులా గురజాడ, కందుకూరి, మంగిపూడి వెంకట శర్మ, గుర్రం జాషువ, కుసుమ ధర్మన్న వంటి మహాకవులు ఇరవయ్యవ శతాబ్దంలోనే కుల వ్యవస్థను నిరసించారు. ఇరవయ్యొకటో శతాబ్దంలో కూడా ఈ కుల స్పృహ పెరుగుతూ ఉండడం ఏ మాత్రం హేతుబద్దం కాదు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత అందరిపైనా ఉంది.

( వ్యాసకర్త : ప్రజాశక్తి బుకహేౌస్‌ గౌరవ సంపాదకులు )
రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి

ఆ విధ్వంసానికి అర్థముందా ?