ప్రజాశక్తి-గుంటూరు : అవినీతి రహిత సమాజం కోసం చట్టంపై ఆవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలలో భాగంగా జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సెమినార్‌లో కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, సంయుక్త కలెక్టర్ జి.రాజకుమారి, అడిషనల్ ఎస్పీ సుప్రజా, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ కె.ఈశ్వరరావు, గుంటూరు అడిషనల్ ఎస్పీ ఎం.మహేంద్ర, డిఆర్‌ఓ కె.చంద్రశేఖర రావు, డిప్యూటీ కలెక్టర్ (ట్రైనీ) కె.స్వాతి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కరీం పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ లంచగొండితనం నేరమని, లంచం ఇచ్చిన వారు, లంచం పుచ్చుకున్న వారు చట్ట ప్రకారం నేరస్తులన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందించేందుకే రాష్ట్రంలో భారీ ఎత్తున అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకే డీబీటీ ద్వారా నిధులు జమ చేస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులు తాము నిర్వహించాల్సిన పనులను చేయకపోవడం కూడా ఆవినీతిగానే పరిగణించాల్సి వుంటుందన్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వ్యవసాయాన్ని చేస్తున్న రైతులు కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ క్రిమిసంహారక మందులతో నష్టపోతున్నారని, వీటి నివారణకు అవసరమైన విజిలెన్స్, ప్రభుత్వ సిబ్బంది ఉన్నా రైతులు నకిలీలతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. జేసీ రాజకుమారి మాట్లాడుతూ కల్తీని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు. విజిలెన్స్ ఎస్పీ కె.ఈశ్వరరావు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖలు, సంక్షేమ పధకాలలో అవినీతి అక్రమాలు, పన్ను ఎగవేతలపై రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంట్, గుంటూరు యూనిట్ చేపట్టిన తనిఖీలు, ప్రగతి గురించి వివరించారు. సుమారు రూ.8.50 కోట్ల నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అనంతరం అందరితో జిల్లా కలెక్టర్ సమగ్రత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జెడ్పీ సిఇఓ జే.మోహన్‌రావు, డిఆర్‌డిఎ పీడీ హరిహరనాథ్, ఎస్సీ వెల్ఫేర్ డిడి మధుసూదనరావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.