Jun 02,2023 23:44

ప్రజాశక్తి-కాకినాడ అక్రమంగా తొలగించిన తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ జిజిహెచ్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు మండుటెండను సైతం లెక్కచేయక శుక్రవారం ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జెఎసి నాయకుడు పిఎస్‌.రాయుడు, స్టాఫ్‌ నర్స్‌ నిర్మల తదితరులు మాట్లాడారు. 12 నుంచి 18 ఏళ్ల పాటు అతి తక్కువ జీతాలతో సేవలందిస్తే ఒక్కసారిగా 85 మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్‌ సమయంలో జీతాలు రాకపోయినా ప్రాణాలు పణంగా పెట్టి సేవలు చేసినా అధికారులు సానుభూతి కూడా చూపలేదన్నారు. 2022జూన్‌ 1 నుంచి అక్రమంగా విధులకు దూరం చేసారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించామన్నారు. జిజిహెచ్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగిస్తూ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసిందన్నారు. అయినా విధుల్లోకి తీసుకోలేదన్నారు. కోర్టు ధిక్కరణ వ్యాజ్యం కూడా దాఖలు చేశామన్నారు. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి తొలగించిన అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చక్రవర్తి, చిన్ని, శ్రీనివాస్‌, రమణ, కళావతి, ఇంద్రాణి, లలిత, బేబి రాణి, పద్మిని, సుఖాజీ, రఫీ, కుమారి, నాని, చిన్ని, రాజు, శివ పాల్గొన్నారు.