Jan 20,2023 22:43

ఐటిడిఎ పిఒగా రజినీకుమారి
బాధ్యతల స్వీకరణ
ఆపై గంటలోనే ఎన్‌టిఆర్‌ జిల్లా హౌసింగ్‌ పీడీగా బదిలీ
ప్రజాశక్తి - బుట్టాయగూడెం

             కెఆర్‌ పురం ఐటిడిఎ పిఒగా బాధ్యతలు స్వీకరించిన గంటకే వేరే ప్రాంతంలోని పోస్టుకు బదిలీ అయిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఏలూరులో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్న ఎం.రజినీకుమారి కెఆర్‌పురం ఐటిడిఎ పిఒగా బదిలీ అయ్యారు. దీంతో ఆమె శుక్రవారం ఉదయం 11 గంటలకు కెఆర్‌పురం ఐటిడిఎ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఐటిడిఎ అధికారులను పరిచయం చేసుకునే ప్రక్రియ సాగుతుండగానే గంట వ్యవధిలోనే ఆమెను ఎన్‌టిఆర్‌ జిల్లా హౌసింగ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అటు ఉద్యోగులు, ఇటు గిరిజనులు అవాక్కయ్యారు. ఎందుకంటే కొంతకాలంగా ఐటిడిఎ పిఒ నియామకంలో సందిగ్ధత నెలకొంది. పిఒగా ఎవరోకరిని నియమించడం, వారు చేరకపోవడం, లేక చేరిన కొద్దిరోజులకే బదిలీ కావడం సర్వసాధారణమైంది. గత అక్టోబర్‌లో ఇక్కడ పిఒగా పని చేస్తున్న శ్రీనుకుమార్‌ను చింతూరు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ చేశారు. చింతూరు ఐటిడిఎ పిఒను రామశేషును ఇక్కడ నియమించారు. అయితే ఆయన విధులు చేపట్టకపోవడంతో జాయింట్‌ కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు ఇన్‌ఛార్జి పిఒగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐటిడిఎ పిఒగా రజినీకుమారి గురువారం నియమితులు కావడం, శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించడం, ఆపై గంటలోనే బదిలీ కావడం జరిగింది. ఈ ప్రభుత్వానికి, అధికారులకు కెఆర్‌పురం ఐటిడిఎ అంటే చిన్న చూపా.. లేక గిరిజనుల పట్ల నిర్లక్ష్యమో తెలియని పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా కెఆర్‌పురం ఐటిడిఎకు పూర్తిస్థాయి పిఒను నియమించాలని గిరిజనులు కోరుతున్నారు.