
వంగర: మండలంలో 19 సచివాలయాలు ఉన్నాయి. ఆయా సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులంతా ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సచివాలయాల్లో పనిచేసి ఆయా సచివాలయాల పరిధిలో గల గ్రామాల ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సేవలను అందించవలసి ఉంది. సచివాలయ వ్యవస్థ ప్రారంభంలో ఉద్యోగులంతా సకాలంలో హాజరైనప్పటికీ పర్మినెంట్ అయిన తరువాత ఉద్యోగులంతా సమయపాలన పాటించకుండా విధులకు డుమ్మా కొడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలో ప్రధానంగా మడ్డువలస, భాగేంపేట, తలగాం, రాజుల గుమ్మడ, వివిఆర్ పేట, కింజంగి, అరసాడ, సంగాం, ఎం సీతారాంపురం తదితర సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వారికి నచ్చిన సమయంలో సచివాలయానికి వచ్చి హాజరు వేసుకుని వెళ్లిపోతున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఈ మేరకు ప్రజాశక్తి గత వారం రోజుల నుంచి మండలంలోని మడ్డువలస, భాగేంపేట, శ్రీహరిపురం, ఎం సీతారాంపురం తదితర సచివాలయాలను ఉదయం 10.30 గంటల నుండి పరిశీలించగా ఒక్కో సచివాలయంలో సుమారు పదిమంది ఉండవలసి ఉన్నప్పటికీ ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా ఉద్యోగులు కనిపించడం లేదు. మిగతా ఉద్యోగులు ఎందుకు రాలేదని హాజరైన ఉద్యోగులని విలేకరులు అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్పారు. పలు సచివాలయాల్లో మూమెంట్ రిజిస్టర్ కూడా సక్రమంగా నిర్వహించడం లేదు. దీంతో మిగతా ఉద్యోగులు ఎక్కడకైనా వెళ్లారా? ఉద్యోగానికి రాలేదా? అన్న విషయంలో స్పష్టత లేదు. విధులు సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అధికార పార్టీకి చెందిన నాయకులే గుసగుసలాడుకుంటున్నారు.
ప్రభుత్వ సేవలపై ప్రజలకు అవగాహన కరువు
ప్రజలు దూర ప్రాంతాలు వద్ద ఉన్న నెట్ సెంటర్ల వద్దకు వెళ్లి ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సచివాలయాల్లో అన్ని సేవలూ ప్రభుత్వం అందిస్తుంది. కానీ ఈ విషయాలను సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అవగాహన కల్పించడం లేదు. దీంతో ఎక్కువమంది దూర ప్రాంతానికి వెళ్లి నెట్ సెంటర్‌ను ఆశ్రయించి ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉన్నా పట్టించుకోకపోవడంతో ప్రభుత్వానికి రావలసిన ఆదాయాన్ని ప్రైవేటు నెట్ సెంటర్లు దోచుకుంటున్నాయి.
తూతూ మంత్రంగా తనిఖీలు
సచివాలయాలను మండల స్థాయి అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో ఉద్యోగులు సక్రంగా విధులకు హాజరు కావడం లేదని ఆరోపణలున్నాయి. కొన్ని సచివాలయాల్లో ఉద్యోగులు మండల స్థాయి అధికారుల మాటను కూడా బేఖాతరు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లాస్థాయి అధికారులు మండలంలో పర్యటించి సచివాలయ ఉద్యోగుల పనితీరుపై ఆరా తీసి తగు చర్యలు తీసుకుంటే తప్ప ప్రజలకు సకాలంలో సేవలు అందవని పలువురు చర్చించుకుంటున్నారు.