ప్రజాశక్తి-మోతుగూడెం, చింతూరు
చింతూరు మండలంలోని మోతుగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితశాస్త్రం బోధిస్తున్న ఎంటిఎస్.రస్కిన్ (55) గుండెపోటుతో సోమవారం మృతి చెందారు. రస్కిన్ ఎప్పటిలాగే సోమవారం ఉదయం పాఠశాలకు వచ్చి విధుల్లో ఉండగా కూర్చున్న కుర్చీ నుండి కిందకు జారి పడిపోయారు. దీంతో తోటి ఉపాధ్యాయులు, సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. రస్కిన్ స్వగ్రామం రంపచోడవరం. దీంతో ఆయన భౌతికయాన్ని రంపచోడవరం తరలించారు. ఆయనకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రస్కిన్ మృతితో ఇటు మోతుగూడెం, అటు రంపచోడవరంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రస్కిన్ గతంలో చింతూరు మండల విద్యాశాఖాధికారిగా కొంతకాలం పనిచేశారు. ఉద్యోగం తొలినాళ్లలో దేవీపట్నం మండలంలోని పలు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. ఆయన యుటిఎఫ్‌లో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాయకుడు పనిచేసి ఉపాధ్యాయుల హక్కుల సాధనకు ఎంతగానో కృషి చేశారు. రస్కిన్ అకాల మరణం ఉపాధ్యాయ లోకానికి తీరని లోటని దేవీపట్నం యుటిఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు పండా శ్రీనివాసరావు, అరుణ్ కుమార్, చింతూరు యుటిఎఫ్ నాయకులు మీనా కబ్బారావు, పండ కృష్ణయ్య, బోగ్గా ముత్తయ్య, భీమయ్య, కవిత తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.










