ధారకొండ పిహెచ్‌సిని ఐటిడిఎ పిఒ సందర్శన
గైర్హాజరైన డాక్టర్, సీనియర్ అసిస్టెంట్ జీతాలు నిలుపుదల
ఇద్దరు పారామెడికల్ సిబ్బందికి షోకాజ్ నోటీసులు
ప్రజాశక్తి -సీలేరు: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వైద్యులు, సిబ్బందిపై ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలకృష్ణ కొరడా ఝళిపించారు. విధులకు డుమ్మా కొట్టిన ధారకొండ పిహెచ్‌సి వైద్యాధికారి నాగభూషణం, సీనియర్ అసిస్టెంట్ ఎన్‌విఎ నారాయణరావులకు మార్చి నెల జీతాలు నిలుపుదల చేయాలని ఆదేశించారు. అలాగే పిహెచ్‌సిలోని ఇద్దరు పారామెడికల్ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గురువారం దారకొండ పిహెచ్‌సిని పిఒ గోపాలకృష్ణ ఆకస్మిక తనిఖీ సమయానికి ఆసుపత్రిలో లేని డాక్టర్ నాగభూషణం, సీనియర్ అసిస్టెంట్లపై చర్యలకు ఆదేశించారు.మార్చినెల జీతాలు నిలుపుదల చేయాలని ఆదేశించారు. అలాగే ఎక్కడికి వెళ్లిందీ మూమెంట్ రిజిస్టర్‌లో నమోదు చేయకపోవడంపై ఎంపిహెచ్‌ఎ ఎం.ఈశ్వరమ్మ, వి.సుభాషిణిలకు వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
అనంతరం ఆసుపత్రిలో అందుతున్న వైద్యసేవలపై డాక్టర్ హిమబిందును అడిగి తెలుసుకున్నారు. రోజువారీ అవుట్ పేషెంట్లు, నెలవారీగా నిర్వహిస్తున్న ప్రసవాలు, మందుల లభ్యత తదితర అంశాలపై ఆరా తీశారు. మందులు కొరత ఉంటే తన దృష్టికి తీసుకురావాలని డాక్టర్ హిమబిందుకు సూచించారు. ఆసుపత్రిలోని రికార్డులను తనిఖీ చేశారు.
పిహెచ్‌సి వద్ద నిర్మిస్తున్న బర్త్ వెయిటింగ్ హాల్‌ను పరిశీలించి, నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండడంతో వేగవంతం చేసి పూర్తిచేయాలని డిఇఇని ఆదేశించారు అక్కడే శిధిలావస్థలో ఉన్న భవనాన్ని తక్షణమే తొలగించాలని సూచించారు. అనంతరం పెదవలసలో నిర్మించిన సిసి రోడ్డును, చింతపల్లిలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ డిఇ చాణక్య ఉన్నారు.










