Mar 19,2021 06:46

ప్రభుత్వ రంగ సంస్థల్ని మోడీ సర్కారు కారుచౌకగా అమ్మేస్తోందని సోనియా గాంధీ బాధను వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ విధించడం కాంగ్రెస్‌ పార్టీ చేసిన తప్పని రాహుల్‌ గాంధీ ప్రకటించారు. దేశ సామాజికార్థిక వ్యవస్థ పురోగమించడానికి ఎంతగానో దోహదపడిన ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉంచాలన్నది కాంగ్రెస్‌ విధానమా? లేక ప్రభుత్వరంగ ఔన్నత్యాన్ని శ్లాఘిస్తూనే వాటిని మెల్లమెల్లగా అమ్మేయడమా? ప్రజాస్వామ్య దేశంలో ఏక వ్యక్తి నియంతృత్వాన్ని నెలకొల్పిన ఎమర్జెన్సీ విధింపుపైనే పశ్చాత్తాపమా? అంటే ఇకపై నిరంకుశ పోకడలకు తావు లేని ప్రజాస్వామిక విధానాలను కాంగ్రెస్‌ అనుసరిస్తుందా? మతోన్మాదాన్ని ఎదిరించడమా లేక మృదు హిందూత్వ వైఖరి చేపట్టడమా? ఇలాంటి మౌలిక విషయాల్లో కాంగ్రెస్‌ వైఖరి ఏమిటి?
 

బిజెపి కన్నా ఏవిధంగా మెరుగు?
'జాతీయ ఆస్తులను కారుచౌకగా విక్రయించడం విజ్ఞత కాదు' అని 'ది హిందూ' పత్రికలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇటీవల ఒక వ్యాసం రాశారు. ఆ శీర్షిక చూడగానే ఎవరికైనా చౌకగా కాకుండా ఎక్కువ ధరకు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తే ఫర్వాలేదా? అనిపిస్తుంది. సర్కారు ఖజానా నుండి పెట్టుబడి పెట్టి కొన్ని కీలక రంగాల్లో భారీ పరిశ్రమలు స్థాపించారు. బోర్డు తిప్పేసిన కొన్ని ప్రైవేటు సంస్థలను, దివాళా తీసిన ఇంకొన్ని పరిశ్రమలను జాతీయం చేశారు. ఈ రెండు విధాలుగా ఏర్పడిన వాటన్నిటికీ ప్రభుత్వం అంటే ప్రజలే యజమానులు. అందువల్లనే ప్రభుత్వరంగ పరిశ్రమలు, సంస్థలు గడించిన లాభాల్లో డివిడెండ్‌ రూపంలో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు లక్షల కోట్ల రూపాయలు జమయ్యాయి. ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు అమలు కావడంవల్లనే ఎస్‌.సి, ఎస్‌.టి, ఒబిసి లకు ఉద్యోగాలు లభించాయి. ఆయా కుటుంబాల స్థితిగతులు మెరుగు పడడానికి, సామాజిక న్యాయం కొంత మేరకైనా జరగడానికీ దోహదపడ్డాయి. వాటిని ప్రైవేటీకరించేస్తే ఇవన్నీ హుళక్కి అవుతాయి. సామాజిక న్యాయం గురించి సోనియా పేర్కొన్నారు. దాన్ని కాపాడాలంటే ఆయా సంస్థలు పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి. అలా కాకుండా సోనియా చెప్పినట్టు మంచి బేరం చేసి మంచి రేటుకు ప్రైవేటుకు అమ్మితే అప్పుడు సామాజిక న్యాయం మాటేమిటి?


పూర్తి ప్రైవేటీకరణ కాకుండా ఐపిఒ జారీ లేదా పాక్షిక ఉపసంహరణ వంటివి కాంగ్రెస్‌ మార్కు పరిష్కారాలు. పరిశ్రమ అలాగే వుంచి, దాని పరిధిలోని భూముల్ని అమ్మేయడం మరో మార్గంగా కూడా చెబుతుంటారు. ఇవి ప్రభుత్వరంగాన్ని నిర్వీర్యం చేసి దొడ్డిదారిన ప్రైవేటుకు దఖలుపర్చడమే కదా! కాకపోతే కొంత ఆలస్యం కావచ్చు. గుండు గుత్త ప్రైవేటీకరణ, నెమ్మదిగా ప్రైవేటీకరణ ఏదైనా అంతిమ ఫలితం ఒక్కటే! 'లాభాల ప్రైవేటీకరణ-నష్టాల జాతీయీకరణ' చేస్తున్నారని కూడా సోనియా తన వ్యాసంలో వాపోయారు. అసలు ఈ విధానాలు తెచ్చింది కాంగ్రెస్సే కదా! భారీ పరిశ్రమలను ప్రభుత్వ రంగంలో నిర్మించిన జవహర్‌లాల్‌ నెహ్రూ, బ్యాంకుల జాతీయీకరణ చేసిన ఇందిరా గాంధీ గురించి మాత్రమే చెప్పుకుంటే చాలదు. 'ఇరవై ఒకటో శతాబ్దానికి...' అంటూ రాజీవ్‌ గాంధీ హయాంలో ప్రారంభమైన ప్రైవేటీకరణ ప్రక్రియ 1991 నుండి పి.వి, మన్మోహన్‌ పాలనలో నయా ఉదారవాద ఆర్థిక విధానాల అమలుతో తీవ్రతరమైంది. ఆ విధానాలనే బిజెపి కొనసాగించింది. మోడీ అతి వేగంగా, తీవ్రంగా అమలు చేస్తున్నారు. కాబట్టి ఈ విధానాల సారంలో కాంగ్రెస్‌, బిజెపి కన్నా ఏ విషయంలో భిన్నంగా ఉంది?
 

మాటలు కాదు.. చేతలు కావాలి..
నయా ఉదారవాద ఆర్థిక విధానాలను తొలి నుంచీ వామపక్షాలు, ముఖ్యంగా సిపిఎం వ్యతిరేకిస్తున్నాయి. ప్రత్యామ్నాయ విధానాలను చెబుతునే ఉన్నాయి. అవకాశం ఉన్న చోట ఆచరణలో చేసి చూపాయి కూడా. అందుకు తాజా ఉదాహరణ కేరళలో పినరయి విజయన్‌ సారథ్యంలోని ఎల్‌డిఎఫ్‌ పాలనలో ప్రభుత్వరంగ సంస్థల పునరుజ్జీవం. విజయన్‌ ప్రభుత్వం ఏర్పడేనాటికి ప్రభుత్వరంగ సంస్థలన్నీ నష్టాల్లో ఉన్నాయి. ఇంకొన్ని మూతపడ్డాయి. ఎల్‌డిఎఫ్‌ అధికారానికి వచ్చిన తొలి ఏడాది (2016-17) నుండి కేరళ మినరల్స్‌ అండ్‌ మెటల్స్‌, ట్రావన్కోర్‌-కొచ్చిన్‌ కెమికల్స్‌ వంటి సంస్థలు లాభాల బాట పట్టాయి. ఐదేళ్లు తిరిగేసరికి మూతపడినవి పున:ప్రారంభం కావడంతోపాటు దాదాపు అన్ని సంస్థలు లాభాల్లోకి వచ్చాయి. ఇదిగాక అక్కడి వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయాధారిత పరిశ్రమలను, వాటిలో కార్మికులను అభివృద్ధి చేయడానికి సర్వతోముఖ ప్రయత్నం గావించింది. సహకార రంగాన్ని విస్తరింపజేయడంలోనూ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం గట్టి కృషి చేసింది. ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేసేందుకు కేరళ పరిశ్రమలు, మౌలిక వసతుల సంస్థను ఏర్పాటు చేసి, ప్రధానంగా ప్రవాస కేరళీయుల నుండి బాండ్ల ద్వారా డబ్బు సమీకరించేందుకు పూనుకుంది. వాటిని అడ్డుకునేందుకు మోడీ సర్కారు శతవిధాల ప్రయత్నించినా ఎల్‌డిఎఫ్‌ సర్కారు ఒకమేరకు విజయం సాధించింది. కాంగ్రెస్‌ అక్కడ బిజెపితో గొంతు కలిపి ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం మీద విష ప్రచారంలో పాలుపంచుకుంటున్నది. అంతే తప్ప తాను బిజెపి కంటె భిన్నమైన పార్టీనని చెప్పుకోవడానికి వీలుగా ప్రభుత్వ రంగాన్ని కాపాడి, అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్‌కు వామపక్షాల మాదిరి విధానం ఉందా అంటే లేనే లేదన్నది గత మూడు దశాబ్దాల అనుభవం చెప్పే సమాధానం.
 

ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్‌ ప్రవచనాలు
ఎమర్జెన్సీ విధించడం కాంగ్రెస్‌ చేసిన తప్పు అని అమెరికన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌కు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాహుల్‌ గాంధీ చెప్పారు. మోడీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థల్ని చేజిక్కించుకొని, ప్రజాస్వామ్యాన్ని బిజెపి అపహాస్యం చేస్తోందని చెబుతూ రాజ్యాంగ సంస్థల్ని హస్తగతం చేసుకునేంత శక్తి కాంగ్రెస్‌కు లేదని వాకృచ్చారు. అయితే, ఎమర్జెన్సీ కాలంలో పాలనా వ్యవస్థనంతటినీ అధికార పార్టీకి పాదాక్రాంతం చేయడం ఎవరూ కాదనలేని వాస్తవం. ఇంకా చెప్పాలంటే నాటి ప్రధాని చుట్టూ వుండే బృందం (కోటరీ) కనుసన్నల్లోనే అన్ని అఘాయిత్యాలూ సాగాయన్నది జగమెరిగిన సత్యం. 'ఇందిరమ్మే ఇండియా' (ఇందిరా ఈజ్‌ ఇండియా) అన్న నినాదం మాటున నాటి కాంగ్రెస్‌ యువ కార్యకర్తలతోసహా నేతలంతా ప్రజలపై పెత్తనం సాగించారు. మోడీ హయాంలో ఎమర్జెన్సీ అని ప్రకటించకుండానే అంతకుమించిన రాజ్యాంగ ఉల్లంఘనలు సాగుతున్నాయి. ఆనాడు రిసెర్చ్‌ అండ్‌ ఎనాలిసిస్‌ (రా) వింగ్‌ ద్వారా పలువుర్ని వేధిస్తే ఇప్పుడు మోడీ సర్కారు ఎన్‌ఐఎ, ఇ.డి, ఐ.బి అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలనూ ప్రత్యర్థులపై ప్రయోగిస్తోంది. యుఎపిఎ చట్టం కింద కేసులు పెట్టి అసమ్మతి గొంతు నొక్కేస్తోంది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని తొత్తడం చేయడంలో ఆ రెండు పార్టీలదీ ఒకే విధానం. కాకపోతే, ఫాసిస్టు ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి విధానాలు మరింత ప్రమాదకరం.
ఏ పార్టీ అయినా ప్రజాస్వామికంగా ఉందనడానికి కొన్ని అంశాలు పరిశీలిస్తే స్పష్టమవుతుంది. తమ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరన్నది నిర్ణయించడంలో సీల్డ్‌ కవర్‌ సంస్కృతిని తెచ్చింది కాంగ్రెస్‌. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. బిజెపిది కూడా అదే దారి. మోడీ షా ద్వయానికి నచ్చినవారికే ఆ పార్టీలోనూ ప్రభుత్వాల్లోనూ పదవులు దక్కుతున్నాయి. ఇక ఆయా పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో స్థానిక సంస్థలకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహిస్తున్నారా అన్న కొలబద్దతో చూస్తే ఆ విషయంలోనూ కాంగ్రెస్‌, బిజెపిలది ఒకే తీరు. అయితే, గడువులోగా ఎన్నికలు జరపకపోతే నిధుల కేటాయింపులు ఆగిపోతాయన్న బెదిరింపుతో కొంతవరకు పరిస్థితి మెరుగుపడింది. ఈ విషయంలో వామపక్ష ప్రభుత్వాలది నికరమైన విధానం. బెంగాల్‌, త్రిపుర వామపక్ష సంఘటన ప్రభుత్వాలున్నపుడు కచ్చితంగా ఐదేళ్లకోసారి అన్ని స్థాయిల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాయి. కేరళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం 'ప్రజా ప్రణాళిక' పేరిట స్థానిక అవసరాలకు అనుగుణమైన ప్రాధాన్యతలతో ప్రణాళికలను రూపొందించే ఉదాత్తమైన విధానానికి బాటలు వేసింది.
 

అలీన విధానానికి తూట్లు
అమెరికాతో వ్యూహాత్మక మైత్రీ బంధాన్ని నెలకొల్పుకునే విషయంలోనూ కాంగ్రెస్‌కు బిజెపి కంటె భిన్నమైన విధానం లేదు. ఇటీవల ఇండో-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు రాహుల్‌ గాంధీ పదేపదే చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకే ప్రాధాన్యతనిచ్చారు. బిజెపి కన్నా, తమ పార్టీ బలమైన జాతీయ (దురహంకార) వాదాన్ని అనుసరిస్తుందని చెప్పడానికి తాపత్రయపడ్డారు. ఒక లౌకిక పార్టీగా మత విద్వేష ఎజెండాల పట్ల కచ్చితంగా వ్యవహరించవలసిన కాంగ్రెస్‌ ఆదినుండీ హిందూ సెంటిమెంట్‌ను ఓటు బ్యాంకుగా పరిగణించింది. లౌకిక విధానాన్ని పాటించడంలో రాజీ పడుతూ 'మృదు హిందూత్వ' విధానాన్ని పాటించింది. ఇప్పటికీ పాటిస్తోంది. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో గో రక్షణ చట్టాలు చేయడం, శబరిమల వివాదంలో కాంగ్రెస్‌ వైఖరి ఇందుకు తాజా తార్కాణాలు.
 

ఆనాటి ఉద్యమ వారసత్వం ఏదీ.. 
ఇటీవల కాంగ్రెస్‌లోని సీనియర్లు 'జి 23' పేరిట అసమ్మతి గళం విప్పారు కానీ వారు కూడా విధానపరమైన అంశాలను కాకుండా నాయకత్వ స్థానాల్లో ఎవరుండాలన్న దాని చుట్టూనే తిప్పుతున్నారు. లౌకికవాదం గురించి ప్రస్తావించినా అది కొందరు నాయకులపై దుగ్ధను సూచిస్తోందే తప్ప విధాన ప్రత్యామ్నాయాన్ని కాదు. నయా ఉదారవాద విధానాల విషయంలో కాంగ్రెస్‌ వైఖరి ఏమిటో పార్టీ అధినాయకత్వం స్పష్టం చెయ్యాలి తప్ప ఒక పరిశ్రమ గురించి లేదా ఇంకో రంగం గురించి ఏవో ఊరడింపు మాటలు చెబితే చాలదు. 'ప్రజల సంపదను కార్పొరేట్లకు, అదీ ఆశ్రిత పెట్టుబడిదారులకు అప్పనంగా కట్టబెట్టే నయా ఉదారవాద విధానాలను అమలు చేయడం తప్పు' అని ఒప్పుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందా? కొన్ని తక్షణ సమస్యలను, వాటికి తాత్కాలిక పరిష్కారాలను సూచించి ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తే కుదరదు. తప్పులు ఒప్పుకొని, విధానపరంగా మారకుండా మాటలు చెబితే ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మలేరు. 


'హిందూత్వ' అభివృద్ధి నిరోధక రాజకీయ శక్తుల ఎదురుదాడి అన్ని రంగాల్లోనూ నానాటికీ తీవ్రమౌతూ ప్రజాస్వామ్యానికి, లౌకిక జీవితానికి, శ్రామిక ప్రజలకు అతి పెద్ద సవాలుగా ఉంది. దీన్ని నిలవరించి ఓడించడం, జాతీయోద్యమ వారసత్వంగా మనకు సంక్రమించిన రాజ్యాంగ హక్కులను, లౌకిక విలువలను, దేశ సార్వభౌమత్వాన్ని, దాన్ని గ్యారంటీ చేసే ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం అవసరం. అందుకోసం వివిధ స్రవంతుల అభ్యుదయ శక్తులు ఒక దగ్గరకు చేరి ఉమ్మడి పట్టు పట్టాలి. జాతీయోద్యమంలో నాయకత్వ పాత్ర పోషించగలిగిన స్థానంలో కాంగ్రెస్‌ ఆనాడు ఉన్నదంటే ఆ పార్టీలో ఈ అభ్యుదయ శక్తులు, బృందాలు బలంగా ఉండడమే కారణం. నేడు మళ్లీ అటువంటి శక్తులు, వ్యక్తులు, బృందాలు కాంగ్రెస్‌ పార్టీలో పైచేయి సాధిస్తాయా లేక ఇప్పుడున్న తిరోగామి శక్తులదే పైచేయిగా కొనసాగుతుందా అన్నదే ప్రశ్న.
                                                                * బి. తులసీదాస్‌