Sep 20,2022 23:59

మాట్లాడుతున్న త్రిపుర ఇఆర్‌సి చైర్మన్‌ రాధాకృష్ణ

ప్రజాశక్తి -మధురవాడ : భవిష్యత్తులో విద్యుత్తు, సౌరశక్తి ఆధారిత వాహనాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రముఖ సంప్రదాయేతర ఇంధన వనరుల నిపుణుడు, త్రిపుర రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఇఆర్‌సి) చైర్మన్‌ డి.రాధాకృష్ణ పేర్కొన్నారు. గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తక్కువ వ్యయంతో విద్యుత్తు వాహనాలను ఛార్జింగ్‌ చేయడం, సౌర పలకలను వాహనాలకు అమర్చడం, ఫ్యూయల్‌ సెల్‌ వినియోగం ద్వారా విద్యుత్తు వాహనాలు ఏ అవాంతరం లేకుండా నడపవచ్చని తెలిపారు. ప్రపంచంలో సౌరశక్తి ఉత్పాదనలో భారతదేశం మూడవ స్థానంలో ఉందని చెప్పారు. విద్యుత్తు రంగంలో సంస్కరణలు ముఖ్యంగా స్మార్ట్‌ మీటర్లు, గ్రిడ్లు, సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రోత్సాహకాలు, అంతర్‌ రాష్ట్ర విద్యుత్తు పంపిణీ, విద్యుత్తు ఆర్థిక అంశాలను ఆయన విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో గీతం స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ డీన్‌ ప్రొఫెసర్‌ సి.విజయశేఖర్‌, ప్రొఫెసర్‌ బి.సెవెంత్లన్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ యు.సల్మా తదితరులు పాల్గొన్నారు.