Jan 25,2023 23:54

రెండో దశ రైతు ఉద్యమం కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి- అనకాపల్లి
రైతాంగానికి ఇచ్చే విద్యుత్తును ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తక్షణమే విరమించాలని అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. స్థానిక కార్మిక కర్షక నిలయంలో బుధవారం రెండో దశ రైతు ఉద్యమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన మూడు రైతాంగ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఏడాది పాటు సాగిన రైతు ఉద్యమంతో కేంద్రం దిగివచ్చి రైతులకు ఇచ్చిన హామీలను నేటికీ నెరవేర్చలేదన్నారు. దీంతో రెండో దశ పోరాటానికి రైతాంగం సిద్ధమవుతుందన్నారు. ఇందులో భాగంగా ఏఐకేసిసి పిలుపుమేరకు దేశవ్యాప్తంగా ఈనెల 26న ట్రాక్టర్‌ ర్యాలీకి పిలుపునివ్వడం జరిగిందని, దీనిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించి చట్టబద్ధత కల్పిస్తామని ఇచ్చిన హామీ తుంగలో తొక్కి రైతులకు నమ్మకద్రోహం చేసిందని పేర్కొన్నారు. రైతు ఉద్యమానికి నాడు కార్మిక వర్గం సంఘీభావం తెలపడంతో ప్రధాని మోడీకి దిగిరాక తప్పలేదన్నారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ.బాలకృష్ణ, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కోరిబిల్లి శంకర్రావు, చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు గంట శ్రీరామ్‌, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌ శంకర్‌ రావు పాల్గొన్నారు.