* సర్వేలో తప్పులను సరిచేయాలని రైతులు వినతి
* స్పందనలో 170 వినతుల స్వీకరణ
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: జిల్లా వ్యాప్తంగా వేళాపాలా లేకుండా విద్యుత్ కోతలు విదిస్తున్నారని, దీనివల్ల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పేర్కొన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందిస్తున్నామని చెపుతున్న అధికారులు ఇఎల్‌ఆర్ పేరుతో ఇష్టం వచ్చిన సమయాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని వివరించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో టిడిపి బిసి సెల్ అధ్యక్షులు కలగ జగదీష్‌తో కలిసి కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో సైతం అప్రకటిత విద్యుత్ కోతల విధించడంతో దోమలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మరో వైపు పెద్దఎత్తున విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్న ఇపిడిసిఎల్ అధికారులు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా అందించాలని కోరారు. అలాగే వంశధార నిర్వాసిత కాలనీ మోదుగువలస ప్రాంతంలో విద్యుత్ సరఫరా రోజుల తరబడి నిలిపి వేస్తున్నారని, నాలుగు రోజులుగా కుళాయిల్లో నీరు రావడం లేదని, దీంతో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని గ్రామానికి చెందిన పైల రామారావు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
ఇటీవల జిల్లాలో నిర్వహించిన సమగ్ర సర్వేలో లోపాలు సరిదిద్దాలని మందస, లావేరు, వజ్రపుకొత్తూరు మండలాలకు చెందిన 27 మంది రైతులు తమ ఫిర్యాదులను అందజేశారు. పాసుపుస్తకాల్లో పేర్లు సక్రమంగా నమోదు కాలేదని, ఆధార్ కార్డులు ఇచ్చినా సచివాలయ ఉద్యోగులు ఇష్టానుసారంగా పేర్లు నమోదు చేయడంతో సమగ్ర సర్వే లోపభూయిష్టంగా నమోదైందని కలెక్టర్‌కు వివరించారు. స్థానికంగా ఉన్న తహశీల్దార్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విన్నవించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా వ్యక్తిగత, సమాజిక సమస్యలపై 170 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో జెసి ఎం.నవీన్, ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఉప కలెక్టర్ జయదేవి, డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్ పాల్గొన్నారు.
వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు
స్పందనలో వచ్చిన వినతులపై అలసత్వం లేకుండా నిర్ణీత కాలవ్యవధిలో ఫిర్యాదిదారుడు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్పందన అనంతరం అధికారులతో మాట్లాడారు. శాఖ వారీగా పెండింగ్ దరఖాస్తులతో పాటు ఒకే ఫిర్యాదు మళ్లీమళ్లీ నమోదు కావడానికి గల కారణాలు గుర్తించాలన్నారు. అలాగే ఫిర్యాదుదార్లకు ఇచ్చే సమాధానం అసంపూర్తిగా ఉండకూడదని, పూర్తి వివరాలతో సమాధానం ఇస్తే పరిష్కారం చూపిన వారవుతారని అన్నారు. జగనన్నకు చెబుదాం వెబ్‌సైట్, 1902 నంబరుకు వెళ్తున ఫిర్యాదులపైనా జాగ్రత్త వహించాలన్నారు. కార్యక్రమంలో డెప్యూటీ డిఎంహెచ్‌ఒ పద్మావతి, సమగ్ర శిక్షా ఎపిసి రోణంకి జయప్రకాష్, మెప్మా పీడీ కిరణ్‌కుమార్, డిఎస్‌ఒ వెంకటరమణ, డ్వామా పీడీ చిట్టిరాజు, ఉద్యానశాఖ ఎడి ప్రసాదరావు పాల్గొన్నారు.










