సాలూరు : సామాన్య, మధ్యతరగతి ప్రజలు వినియోగించే విద్యుత్తు ఛార్జీలను అనేక రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ పోతుందని, ఇందుకు నిరసనగా ప్రజలంతా పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు పిలుపునిచ్చారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లుల దగ్ధం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ రంగాన్ని నాశనం చేస్తున్నాయని, తక్కువ రేటుకే వినియోగదారులకు, పేదలకు, కరెంటు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ సర్దుబాటు ఛార్జీల పేరుతో ఎప్పుడో వాడిన కరెంటుకు కూడా నేడు బిల్లులు కట్టిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని అన్నారు. విద్యుత్ రంగాన్ని నాశనం చేసే విధానాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతుంటే, రాష్ట్రంలో వైసిపి మద్దతు పలుకుతూ వాటిని అమలు చేస్తుందని విమర్శించారు. అందులో భాగంగానే స్మార్ట్ మీటర్లు', సర్దుబాటు చార్జీలు ,వ్యవసాయ పంపుసెట్లు తదితర విధానాలను తీసుకొస్తున్నారని, భవిష్యత్తులో వీటన్నింటిపై ప్రజలు పెద్ద ఎత్తున మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే సిపిఎం ప్రజలందర్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న భారాలపై చైతన్య పరుస్తూ గడిచిన నాలుగు రోజులుగా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ప్రజలంతా భారాలపై జరిగే పోరాటంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం సాలూరు పట్టణ కార్యదర్శి ఎన్‌వై నాయుడు, మండల కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, పట్టణ కమిటీ నాయకులు టి.రాముడు, లింగరాజు, శివ, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం టౌన్ : ఇఎల్‌ఆర్ పేరుతో విద్యుత్ కోతలు నిలిపివేయాలని, విద్యుత్ ఛార్జీలు, ధరలు తగ్గించాలని, ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పట్టణ కమిటి ఆధ్వర్యంలో పట్టణంలోని 10,11 సచివాలయాల వద్ద నాయకులు గొర్లి వెంకటరమణ, రెడ్డి శ్రీదేవి, పాకల సన్యాసిరావు, బంకురు సూరిబాబు, పడాల రాజశేఖర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం సచివాలయం కార్యదర్శికి వినతిని అందజేశారు. కార్యక్రమంలో భాస్కరరావు, రాజు, పండు, గౌరమ్మ, వెంకటమ్మ, జానకమ్మ, సింహాచలం, కుమారమ్మ, శాంతి పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : గిరిజనుల హక్కులు, చట్టాలు రక్షణకై ఐక్యంగా పోరాడాలని సిపిఎం మండల కార్యదర్శి కోలక అవినాష్ పిలుపునిచ్చారు. మండలంలోని చాపరాయి బిన్నిడి, రాయగడ జమ్మూ, చెముడుగూడ సచివాలయాల వద్ద శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. నూతన చట్టాలను తీసుకువచ్చి అడవి నుంచి గిరిజన దూరం చేసే కుట్ర మోడీ సర్కార్ చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు పి గౌరయ్య, పి.మోహన్ రావు, పి.అసిరయ్య, ఎం.వెంకటరావు, ఎం .రమణ , బిజశంకర్రావు ఉన్నారు. సీతానగరం : పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని సిపిఎం మండల కార్యదర్శి రెడ్డి ఈశ్వరరావు డిమాండ్ చేశారు. మండలంలోని చినబోగిలి, పెదబోగిలి గ్రామ సచివాలయాల వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. పెంచిన విద్యుత్‌ఛార్జీలు తగ్గించాలన్నారు. అనంతరం ఇఒ జి.వెంకట్రావుకు, పంచాయతీ కార్యదర్శి మనోహర్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు జి.వెంకటరమణ, బి.అప్పారావు, వై.రామారావు తోపాటు పరుగురు పాల్గొన్నారు. గరుగుబిల్లి: మండలంలో స్థానిక సచివాలయంలో విద్యుత్‌ఛార్జీలు, నిత్యవసర ధరలు తగ్గించాలని వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు వై.మన్మధరావు, నాయకులు జగ్గారావు, ప్రకాశం, సాంబనాయుడు, నరసింహం పాల్గొన్నారు. కొమరాడ : మండలంలోని కూనేరు సంతలో ర్యాలీ అనంతరం సమావేశం ఏర్పాటు చేసి సచివాలయలు వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.ఇందిరా, జిల్లాకమిటీ సభ్యులు కె.సాంబమూర్తి, నాయకులు పాల్గొన్నారు. వీరఘట్టం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా శనివారం మండల కేంద్రంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు.ఎం తిరుపతిరావు ఆధ్వర్యంలో సంతకల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. సంతకాలు సేకరణ చేసి మేజర్ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారి వి.రామచంద్రరావుకు అందజేశారు. ఆయనతో పాటు మండల నాయకులు ఎన్ సింహాచలం , రాము చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు .పార్వతీపురం రూరల్ : ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలే బుద్ధి చెప్పాలని సిపిఎం నాయకులు బంటుదాసు అన్నారు. సమరభేరీ కార్యక్రమంలో భాగంగా శనివారం డోకిశీల, తాళ్లబురిడి, బాలగొడబ, సచివాలయం ఎదుట నిరసన తెలిపారు. విద్యుత్ ఛార్జిలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు పెట్టవద్దని సర్దుబాటు చార్జీలు విధించవద్దని డిమాండ్ చేశారు. పి.రాము, అనీల్ సంతు, శివ నాయుడు తదితరులు పాల్గొన్నారు.










