Jan 15,2023 00:06

నోటీసు చూపుతున్న బాధిత రైతు

ప్రజాశక్తి -బుచ్చయ్యపేట : విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఓ సన్నకారు రైతుకి రూ.లక్షల్లో బిల్లు వచ్చింది. మండలంలోని రాజాం గ్రామానికి చెందిన మరిసా అప్పలనాయుడు సుగర్‌ కేన్‌ క్రషింగ్‌కు రెండు విద్యుత్‌ కనెక్షన్లను గతంలో వేరే వ్యక్తుల నుండి కొనుగోలు చేశారు. కేటగిరి 3లో వీటికి ప్రభుత్వం ఉచిత విద్యుత్తు అందించేది. విద్యుత్‌ శాఖ అధికారులు వీటి కేటగిరి మార్చేశారు. దీంతో సర్వీస్‌ నెంబరు 958కి రూ.2.61 లక్షలు, సర్వీస్‌ నెంబరు 1147కి రూ.86వేలు బిల్లు పంపారు. ఈ బిల్లును తక్షణమే కట్టాలని విద్యుత్‌ శాఖ అధికారులు అప్పలనాయుడుకు నోటీసులు పంపారు. అర్హత ఉన్నప్పటికీ విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సదరు రైతు ఉచిత విద్యుత్తును కోల్పోయాడు. తాను వాడకపోయినా కేటగిరి మార్చేసి పాత బకాయిలన్నీ చెల్లించమంటున్నారని బాధిత రైతు అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై తాను విద్యుత్‌ శాఖ అధికారులు సంప్రదించినా పట్టించుకోలేదన్నారు. విద్యుత్‌ అధికారులు బిల్లు చెల్లించాలని ఒత్తిడి చేస్తుండడంతో అప్పలనాయుడు ఆందోళన చెందుతున్నాడు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధిత రైతు కోరుతున్నాడు.