Jul 24,2021 06:20

   యా ఉదారవాద విధానాలకు మొదట నుంచి ప్రయోగశాలగా మారిన విద్యుత్‌ రంగంపై కేంద్ర ప్రభుత్వం మరో మారు ప్రజా వ్యతిరేక సంస్కరణల కత్తి దూసింది. డిస్కామ్‌లకు మౌలిక సదుపాయాలు సమకూర్చే మోసపూరిత హామీలతో రాష్ట్రాలపై పెత్తనం చెలాయించేందుకు 'సంస్కరణల అనుసంధాన ఫలితాల ఆధారిత పంపిణీ పథకం (ఆర్‌.ఎల్‌.ఆర్‌.బి.ఎస్‌.డి)' ప్రతిపాదించింది. ప్రీపెయిడ్‌ మీటర్లు బిగించడం, వ్యవసాయ ఫీడర్లను వేరు చేయడం, భారాలు పెంచే ప్రాతిపదికల ఏర్పాటు వంటి వినాశకర చర్యలను ఈ పథకం కింద అమల్జేస్తారు. విద్యుత్‌ సంస్కరణల తొలి దశ (1990వ దశకం)లో జనరేషన్‌ రంగాన్ని ప్రయివేటుకు అప్పగించారు. ఇప్పుడు పంపిణీ రంగాన్ని (డిస్కామ్‌లను) ప్రైవేటుకు అప్పగించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పనిలో పనిగా విద్యుత్‌ రంగంలో రాష్ట్ర ప్రభుత్వాలకున్న అధికారాలను గుంజుకోవాలని కేంద్రం చూస్తోంది. సంస్కరణలు అమల్జేస్తే రాష్ట్రాలు అదనపు అప్పులు తీసుకోవచ్చునని ఎర చూపుతున్నది.
    కోవిడ్‌ నేపథ్యంలో అన్ని రంగాల మాదిరే డిస్కామ్‌లు కూడా ఆటుపోట్లకు గురయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో 35 ఏళ్ల కనిష్ట స్థాయిలకు విద్యుత్‌ వినియోగం పడిపోయింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్లు విధించిన కారణంగా పారిశ్రామిక రంగం పడకేయడంతో కేవలం 1271.54 బిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ మాత్రమే వినియోగమైంది. లాక్‌డౌన్లు ఎత్తివేసినా పరిస్థితిలో పెద్దగా వచ్చిన మార్పేమీ లేదు. ఇప్పుడు ప్రీపెయిడ్‌ మీటర్లు పెట్టుకోవడం, వ్యవసాయ ఫీడర్లను విడదీయడం వంటి చర్యలు చేపడితే నష్టాల నుంచి గట్టెక్కే మార్గం చెబుతామంటూ కేంద్రం ఎర వేస్తోంది. ప్రయివేటు కంపెనీలకు దోచిపెట్టే పన్నాగమే తప్ప డిస్కామ్‌ లను ఉద్ధరించే సంకల్పం కాబోదు. డిస్కామ్‌ లకు నష్టాలు కొత్త సమస్య కాదు. నష్టాల్లో కూరుకుపోయి నిర్వహణ భారమై గ్రిడ్‌లు కుప్పకూలిన ఘటనలు గతంలోనూ ఉన్నాయి. అదే సాకుతో 'ఉదరు' లాంటి ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించిన ప్రభుత్వాలు అదే సాకుతో అంచెలంచెలుగా విద్యుత్‌ రంగాన్ని ప్రయివేటుకు కట్టబెట్టే చర్యలు కొనసాగిస్తూ వచ్చాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నందునే ఆదాయాలకు గండి పడుతోందని, ప్రయివేటుకు కట్టబెడితే వినియోగదారులకు సౌకర్యవంతమైన సేవలందుతాయనేది కార్పొరేట్‌ ఆర్థికవేత్తల వాదన. ప్రీపెయిడ్‌ మీటర్లు (పిపిఎం)లు పద్ధతిని అమల్జేస్తే పేదలకు కరెంటు వెలుగులు దూరమైపోతాయని ఈ పథకం ఇప్పటికే అమల్లో ఉన్న జర్మనీ, అమెరికా, ఇటలీ తదితర దేశాల అనుభవం చెబుతోంది. ఇక ఆర్థిక అసమానతలు తీవ్ర స్థాయిలో ఉండే మన దేశంతో పిపిఎం ల ప్రభావం విశాల ప్రజానీకంపై పడటం ఖాయం. విద్యుత్‌ పంపిణీ లోనూ తీవ్రమైన అసమానతలు తప్పవు. ప్రయివేటుకు కట్టబెట్టడం వల్ల ప్రాధమ్యాలు మారిపోతాయి. ప్రజా ప్రయోజనం కంటే లాభాల వేటే ప్రధానం కాబట్టి బలహీన వర్గాల ప్రజానీకం తీవ్ర నిర్లక్ష్యానికి గురౌతుంది. బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ ను నష్టాల్లోకి నెట్టే ప్రయివేటు ఆపరేటర్లకు టెలికాం రంగాన్ని కట్టబెట్టిన ఫలితాలు చూస్తున్నాం. మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇంటర్నెట్‌ లేకపోవడంతో ఆన్‌లైన్‌ చదువులకు, ఇతర పౌర సేవలకు దూరమైన వైనాన్ని చూస్తున్నాం. రేపు విద్యుత్‌ కూడా ప్రయివేటు ఆపరేటర్ల చేతిలోకి వెళ్లిపోతే ఎంత దయనీయమైన స్థితి లోకి పేద ప్రజలు వెళ్లిపోతారో ఊహించవచ్చు.
     కేంద్రం విధించిన షరతులను దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుగా అమలుకు పూనుకోవడం నష్టదాయకం. కేంద్ర ప్రభుత్వ షరతుల మేరకు వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల బిగింపు, గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ సంస్థల విద్యుత్‌ వాడకానికి డిస్కామ్‌లకు నేరుగా చెల్లింపులు వంటివి ఇప్పటికే అమలు చేస్తోంది. వినాశకరమైన ఈ మార్గాన్ని వీడి రాష్ట్ర విద్యుత్‌ రంగాన్ని పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. స్మార్ట్‌ మీటర్ల బిగింపు, ప్రత్యేక విద్యుత్‌ పోలీసులు, డిస్కాముల్ని దళారీ (ప్రాంఛైజీ)లకు అప్పగించే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలన్నిటినీ తిరస్కరించాలి. రాష్ట్రాల హక్కులను కాపాడుకునేందుకు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలి.