ప్రజాశక్తి - వినుకొండ : బొల్లాపల్లి మండలంలో విద్యుత్ విజిలెన్స్ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. మండలంలోని పేరూరుపాడు, కనుమల చెరువు, వెల్లటూరు, బండ్లమోటు, బొల్లాపల్లి గ్రామాల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సూర్యప్రకాష్, డిఇఇలు శ్రీనివాసరావు, రవికుమార్, కిరణ్‌బాబు ఆధ్వర్యంలో 114 మంది సిబ్బంది 32 బృందాలుగా 1325 సర్వీసులు తనిఖీ చేశారు. 145 మంది వినియోగదారులు విద్యుత్‌ను అక్రమంగా వినియోగించుకున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. మీటరు లేకుండానే విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న 52 మందిని గుర్తించి, రూ.53 లక్షలు జరిమానా విధించారు. మీటరు ఉండి అక్రమంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారని 23 మందినికి రూ.1.40 లక్షలు జరిమానా వేశారు. అనుమతించిన కేటగిరికి భిన్నంగా విద్యుత్‌ను వినియోగిస్తున్న ఒకరికి రూ.ఐదు లక్షల అపరాధరసు విధించారు. అనుమతించినప్పటి నుండి అధికంగా విద్యుత్ వినియోగిస్తున్నారని 62 మందినికి రూ.1.61 లక్షలు జరిమానా వేశారు. వినియోగం కంటే బిల్లు తక్కువ ఉన్న ఏడు సర్వీసును గుర్తించి రూ.50 వేలు జరిమానా విధించారు. మొత్తంగా రూ.4.90 లక్షలు అపరాధ రుసుం విధించినట్లు అధికారులు తెలిపారు. మీటర్లకు తప్పనిసరిగా సీలు ఉండేలా వినియోగదార్లు జాగ్రత్త పడాలని, సీలు ఊడిపోతే అధికారుల దృష్టికి తీసుకోవాలని అధికారులు సూచించారు. మీటరు సీలును తొలగించినా గాట్లు పెట్టినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుత తనిఖీల్లో అపరాధ రుసుం విధించబడిన వారు వాటిని చెల్లించకుంటే ఆస్తులనూ జప్తు చేస్తామన్నారు.










