కడప అర్బన్ : విద్యుత్ కొనుగోళ్ల వర్కింగ్ క్యాపిటల్ పేరుతో వినియోగదారులపై అదనపు భారం మోపే చర్యలను ఆపాలని సిపిఎం నగర కార్యదర్శి ఎ. రామమోహన్ డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని పాత బస్టాండ్‌లో ఉన్న సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ట్రూ ఆప్, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో పెద్ద ఎత్తున భారం వేస్తోందని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ గోరుచుట్టు మీద రోకటి పోటులా విద్యుత్ కొనుగోళ్ల వర్కింగ్ క్యాపిటల్ వడ్డీ పేరుతో అదనపు వసూలు చేసేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు చేసిన సూచనలను అమలు చేయకుండా చూడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సర్కారు చెల్లించాల్సిన విద్యుత్ బిల్లుల మీద వేసే వడ్డీని కూడా ట్రూ ఆప్ ఛార్జీల పేరుతో ప్రజల నుంచి వసూలు చేయడం దుర్మార్గమని విమర్శించారు. గహ వినియోగదారులతో పాటు చిన్న చిన్న పరిశ్రమలు కూడా పెరిగిన విద్యుత్ ఛార్జీలను భరించలేకపోతున్నాయన్నారు. ఫలి తంగా ఇప్పటికే చాలా పరిశ్రమలు మూతపడుతున్నాయని ఆం దోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్కరణలు వినియోగదారులకు లాభదా యకంగా ఉండాలి కానీ కంపెనీలకు ఉపయోగంగా ఉండకూడదన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 18న ఉదయం 10 గంటలకు పాత బస్టాండ్‌లో ఉన్న సిపిఎం కార్యాలయంలో అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు పారుక్ హుస్సేన్, ఓబులేసు, మహబూబ్ తార పాల్గొన్నారు.










