ప్రజాశక్తి- పొందూరు: పొందూరు సిస్టమ్ కళాశాల సమీపంలోని చికెన్‌సెంటర్ వద్ద 33/11 కెవి విద్యుత్ వైర్ తెగి పట్టణానికి చెందిన గొర్లె వసంత్‌కుమార్ (27)పై పడడంతో మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిస్టమ్ కళాశాల సమీపంలో బైక్ మెకానిక్ వద్ద ఉన్న యువకుడు చికెన్‌సెంటర్ ముందు అధిక విద్యుత్ ప్రవహించే 33/11 కెవి వైర్ తెగిపడేందుకు సిద్ధంగా ఉండడాన్ని గమనించాడు. చికెన్ సెంటర్‌లో ఉన్న వారిని కాపాడాలనే ఉద్దేశంతో వారిని అప్రమత్తం చేస్తూ బయటకు రావాలని కేకలు వేశాడు. ఇంతలో వైర్ తెగి యువకుడిపై పడడంతో 20 అడుగుల దూరంలో ఎగిరిపడ్డాడు. వెంటనే సమీపంలో ఉన్న వారు గమనించి విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో ఉన్న యువకుడిని స్ధానిక సామాజిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో పొందూరు విషాద ఛాయలు అలముకున్నాయి. దీనిపై పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
పెద్దఎత్తున తరలివచ్చిన జన సైనికులు
ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీలో పీజీ చదువుకున్నారు. ఓ పక్క డ్రైవర్‌గా పనిచేస్తూ, మరోపక్క కూలి పనులకు వెళ్తూ... తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేవాడు. జనసేన పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తూ, క్రియాశీలకమైన జనసైనికునిగా గుర్తింపు పొందాడు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ప్రజలను మేల్కొలిపే వీడియోలో పెడుతూ అందరి మన్నలను అందుకునేవాడు. ప్రమాదంలో వసంత్‌కుమార్ మృతి చెందాడన్న విషయం తెలియడంతో నియోజకవర్గ ఇన్‌ఛార్జి పేడాడ రామ్మోహనరావుతో పాటు పలు గ్రామాలకు చెందిన జనసైనికులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి వద్దకు చేరుకుని కన్నీరు పెట్టారు.
విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ...
వసంత్‌కుమార్ మృతి చెందడానికి విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో నియోజక వర్గ ఇన్‌ఛార్జి రామ్మోహనరావుతో పాటు, జనసైని కులు మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని ఎఇ దుర్గాప్రసాద్‌ను కోరారు. ఈ ప్రమాదాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. తెగిపడిన విద్యుత్ వైర్ పొలం వైపు పడిందని, అదే నిత్యం రద్దీగా ఉండే శ్రీకాకుళం-రాజాం రహదారిపై పడి ఉంటే ఎంతో మంది ప్రాణాలను కోల్పోయేవారని పలువురు పేర్కొంటున్నారు.
బాధాకరం : రవికుమార్
విద్యుదాఘాతంతో వసంతకుమార్ మృతి చెందడం బాధకరమని టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ ఆదేవన వ్యక్తం చేశారు. మండలం లోని ఇల్లయ్యగారిపేటలో ఆదివారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం నాణ్యతలేని నాసిరకం పరికరాలు వినియోగించడం వల్లే ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు










