ప్రజాశక్తి-సీలేరు
ఆంధ్ర ఒరిస్సా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నుంచి 4000 క్యూసెక్కులు నీటిని సీలేరు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి అవసరాలు నిమిత్తం తీసుకుంటున్నామని ఎస్‌ఈ సివిల్ కేకేవి.ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సీలేరు జల విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి నిరాటంకంగా జరుగుతుందని వెల్లడించారు. సీలేరు కాంప్లెక్స్ పరిధిలోని డొంకరాయి పవర్ కెనాల్ 3/6 రీచ్ వద్ద కెనాల్‌కు గండి పడడంతో కాంప్లెక్స్ పరిధిలోని డొంకరాయి, పోల్లూరు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిందని తెలిపారు. దీంతో సీలేరు జల విద్యుత్ కేంద్రంపై ఒత్తిడి పెరిగిందని, ఈ నేపథ్యంలోని గ్రిడ్డు ఆదేశాలకు అనుగుణంగా సీలేరు జల విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిరంతంర చేస్తున్నామని వెల్లడించారు. శుక్ర శనివారాల్లో 1.7 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేయడం జరిగిందని తెలిపారు. కెనాల్ గండి పనులు చేపట్టడానికి ఉన్నత అధికారుల నుంచి అనుమతులు కోరామని, అనుమతులు వచ్చిన వెంటనే పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడతామని చెప్పారు. పనులు చేపట్టిన తర్వాత ఎటువంటి సాంకేతికపరమైన సమస్యలు తలెత్తకుండా ముందస్తుగానే అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.










