చీఫ్ ఇంజనీర్ శ్రీధర్
ప్రజాశక్తి -సీలేరు
గోదావరి డెల్టాకు నీటి విడుదల నేపథ్యంలో సీలేరు కాంప్లెక్స్ పరిధి పోల్లూరు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ సెంట్రల్ అథారిటీ నిర్దేశించిన విద్యుత్ ఉత్పత్తి టార్గెట్ ఈ ఏడాది రీచ్ అవ్వలేకపోయామని చీఫ్ ఇంజనీర్ బి శ్రీధర్ వెల్లడించారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత ఏడాది నదీ పరివాహక ప్రాంతమైన ఒడిస్సాలో వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో బలిమెల జలాశయంలో ఆశించిన స్థాయిలో నీటి నిలువలు చేరలేదని తెలిపారు. దీంతోపాటు గోదావరి డెల్టా పంట పొలాలకు 12 టీఎంసీలు నీటిని, విద్యుత్ ఉత్పత్తి చేయకుండా నేరుగా డొంకరాయి జలాశయం గేట్లు ద్వారా విడుదల చేయవలసి వచ్చిందని చెప్పారు. దీంతో సీలేరు జల విద్యుత్ కేంద్రం కూడా ఉత్పత్తిలో టార్గెట్ రీచ్ కాలేదని పేర్కొన్నారు. డొంకరాయి పవర్ కెనాల్ గత ఏడాది గండి కారణంగా 20 రోజులు పాటు పోల్లూరు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని తెలిపారు. సీలేరు కాంప్లెక్స్ పరిధిలో ప్రస్తుతం సీలేరు, డొంకరాయి, పోల్లూరు జల విద్యుత్ కేంద్రాల్లో 6 నుంచి ఏడు మిలియన యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు. గోదావరి డెల్టాకు ఈనెల 31 వరకు డొంకరాయి జలాశయం గేట్లు ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరగకుండా 3000 క్యూ సెక్కులు నీటిని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 10 నుంచి ఈ నెలాఖరు వరకు 9.55 టీఎంసీల నీరు గోదావరి డెల్టాకు నీటి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. సీలేరు కాంప్లెక్స్ పరిధిలోని బలిమెలా జలాశయంలో మన వాటా 15.8 టీఎంసీలు గుంటవాడ డొంకరాయి జలాశయాల్లో మరొక ఐదు టీఎంసీలతో కలుపుకొని 20.8 టీఎంసీలు నీటి నిలువలు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. రాబోయే రెండు నెలల్లో ఉన్న నీటి నిలువలను ఒక్క విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తేనే నీటి కొరత ఉండదని, వచ్చే నెల కూడా గోదావరి డెల్టాకి నీటిని విడుదల చేయవలసి వస్తే రాబోయే నెలల్లో విద్యుత్ ఉత్పత్తికి నీటి సమస్య తలెత్తే పరిస్థితి ఉంటుందని తెలిపారు.










