Mar 05,2023 23:30

మాట్లాడుతున్న సత్యనారాయణ

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌:రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ ఉద్యోగులపై నిర్లక్ష్యం చేస్తుందని యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ డివిజన్‌ అధ్యక్షులు వేపాడ సత్యనారాయణ తెలిపారు. స్థానిక ఎన్జీవో హౌంలో ఆదివారం జరిగిన సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ, విద్యుత్‌ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు, ఎరియర్స్‌ సకాలంలో ప్రభుత్వం అమలు చేయడం లేదని, ఫలితంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. యూనియన్‌ అడ్వైజర్‌ కే.భాస్కరరావు మాట్లాడుతూ, విద్యుత్‌ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ సేవలను అందిస్తున్నారని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. విద్యుత్‌ సంస్థలను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలన్నారు.
యూనియన్‌ గౌరవాధ్యక్షులు డి.సత్తిబాబు మాట్లాడుతూ, విద్యుత్‌ సంస్థలన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకొని పెట్టుబడిదారులకు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని తెలిపారు. ఫలితంగా విద్యుత్‌ ఉద్యోగులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోలేదన్నారు. తన సొంత ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వానికి వంత పాడుతుందని విమర్శించారు. ఇదే కొనసాగితే రాష్ట్రంలో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్థలన్నింటినీ తన ఆధీనంలో ఉంచుకోవాలని కోరారు.అనంతరం నూతన కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శివ, చంద్రశేఖర్‌, జానీ, జయరాజు పాల్గొన్నారు.