Jul 27,2023 23:10

పలాస విద్యుత్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న విద్యుత్‌ ఉద్యోగులు

ప్రజాశక్తి - పలాస, టెక్కలి రూరల్‌: అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ విద్యుత్‌ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. పలాసలో సబ్‌ స్టేషన్‌ వద్ద, టెక్కలిలో విద్యుత్‌ డివిజనల్‌ కార్యాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టెక్కలి డివిజన్‌ విద్యుత్‌ జెఎసి నాయకులు ఎస్‌.శ్రీనివాసరావు మాట్లాడుతూ పిఆర్‌సి అమలు చేయకుంటే నిరవధిక సమ్మెకు వెనకాడబోమని హెచ్చరించారు. అవుట్‌సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ సిబ్బంది ఎవరైనా మరణిస్తే వెంటనే కారుణ్య నియమకాలు చేపట్టాలన్నారు. ఎరియర్స్‌ బకాయిలు విడుదల చేయాలని, పెండింగ్‌ డిఎలను తక్షణం చెల్లించాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు నిరంతరం వెలుగులు అందిస్తున్న విద్యుత్‌ సిబ్బంది సమస్యలపై ప్రభుత్వం అలసత్వం వహించడం తగదన్నారు. కార్యక్రమంలో జెఎసి నాయకులు ఎన్‌.లోకేశ్వరరావు, డి.శేఖర్‌, సురేష్‌ కుమార్‌, ఇఇ ప్రసాదరావు, డిఇఇ కృష్ణమూర్తి, ఎఎఒ భాస్కరరావు, లైన్‌ ఇన్‌స్పెక్టర్లు జి.రాజారావు, కె.గిరి, హిమగిరి తదితరులు పాల్గొన్నారు.